Begin typing your search above and press return to search.

ఎన్టీఅర్ కి భారతరత్న- దశాబ్దాల ఆలస్యం !

ఎన్టీఅర్ బహు ముఖ ప్రజ్ఞా ధురీణుడు. ఆయన సినీ రంగంలో మూడున్నర దశాబ్దాల పాటు రాణించి మకుటం లేని మహారాజుగా వెలిగారు.

By:  Satya P   |   29 May 2026 1:47 AM IST
ఎన్టీఅర్ కి భారతరత్న- దశాబ్దాల ఆలస్యం !
X

ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఒక మహానుభావుడికి భారతరత్న పౌర పురస్కారం దక్కడంతో దశాబ్దాల ఆలస్యం జరు తోంది . నిజంగా దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న దక్కాల్సిన అన్ని అర్హతలు ఎన్టీఆర్ కి ఉన్నాయి. ఆయన 1996 లో కన్ను మూశారు. ఇప్పటికి మూడు దశాబ్దాల కాలం గడచిపోయింది. ఏనాడో ఆయనకు ఈ అత్యున్నత గౌరవం దక్కాలన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 18 కోట్ల మంది తెలుగు వారి కోరిక. అంతే కాదు ఎన్టీఆర్ కి భారతరత్న దేశంలోకి ఇతర భాషలకు చెందిన వారు సైతం ఆహ్వానించే విషయంగా ఉంది. నూటికో కోటికో ఈ నేల మీద పుట్టిన అరుదైన మహానుభావుల జాబితాలో ఎన్టీఅర్ ముందు వరసలో ఉంటారు. అలాంటి వారికి భారతరత్న ఇవ్వడం అన్నది దేశ ప్రజల కోరిక కూడా అనడంలో సబబు ఉంది.

రెండు రంగాలలో మేటి :

ఎన్టీఅర్ బహు ముఖ ప్రజ్ఞా ధురీణుడు. ఆయన సినీ రంగంలో మూడున్నర దశాబ్దాల పాటు రాణించి మకుటం లేని మహారాజుగా వెలిగారు. పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, కధా రచయిత, అభిరుచి కలిగిన నిర్మాత. స్టూడియో అధినేత. ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఆయన కనిపిస్తారు. ఎన్టీఆర్ సినీ రంగంలో సాధించిన రికార్డులు ఎప్పటికీ చెరిగిపోనివి, ఎవరూ కూడా అందుకోలేనివి కూడా. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి జాతీయ రాజకీయాలను సైతం కీలక మలుపు తిప్పారు. పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది. గిన్నిస్ బుక్ లో ఈ రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఇక ఆయన పద్నాలుగేళ్ళ రాజకీయ జీవితం ఒక సంచలనం. ఆయన సంక్షేమ పధకాలే ఈ రోజున దేశంలో అమలు అవుతున్నాయంటే ఆయనకు పేదల పట్ల వారి అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావం నిబద్ధత అన్నది విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉంది.

నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా :

ఇక 1977లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో స్థాపించడానికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చేసిన కృషి అంతా గుర్తుంచుకుంటారు. మళ్ళీ అలాంటి ప్రయోగం చేసిన వారు ఎన్టీఆర్. 1987 ప్రాంతంలో ఆయన దేశంలోని కాంగ్రెసేతర పక్షాలను ఏపీకి అహ్వానించి అందరినీ ఒక త్రాటి మీదకు తెచ్చి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. 1989లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం వెనక ఎన్టీఅర్ కృషి ఎంతో ఉంది. ఈ రోజున దేశంలో కాంగ్రేసేతర రాజకీయం బలంగా సాగుతోంది అంటే దానికి పునాదులు వేసిన వారు ఎన్టీఆర్ అని చెప్పాలి.

ప్రజాదరణ ఆయనదే :

నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఎన్టీఆర్ సభలకు జనాలు తరలి వచ్చేవారు. ఆ అభిమానం ఆయన దివంగతులు అయ్యేంతవరకూ కొనసాగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలే జనాలుగా కనిపించేవారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన వారు ఎన్టీఆర్, మంత్రులుగా చేసిన ఘనత కూడా ఆయనదే. ఒక సరికొత్త తరాన్ని రాజకీయానికి పరిచయం చేసి రాజకీయాల్లో కీలక మార్పులకు సంస్కరణలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ మూడు సార్లు తన నాయకత్వంలో టీడీపీని గెలిపించారు. ఈ మూడు సార్లూ కూడా రికార్డు మెజారిటీతో సీట్లూ ఓట్లు సాధించింది టీడీపీ. జనం గుండె చప్పుడుగా నిలిచి ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్ ని ఇప్పటికైనా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు భారతరత్న పౌర పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా తెలుగు వారికే కాదు దేశ ప్రజలకు కూడా ఎంతో ఆనందం కలిగించే ప్రయత్నం పాలకులు చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఆ శుభ ఘడియల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న దక్కడం అంటే ప్రతీ తెలుగు వాడూ గర్వించినట్లే అని చెప్పాల్సి ఉంది.