Begin typing your search above and press return to search.

పోస్టర్లపై పేడ ముద్దలు...ఎన్టీఆర్ ఏఎన్నార్ ఏం చేశారంటే ?

ఇక ఇది జరిగిన పదేళ్ళ తరువాత ఎన్టీఆర్ స్వయంగా అక్కినేనితో కలసి నటించాలని ఒక ప్రతిపాదన తెచ్చారు.

By:  Satya P   |   9 Jun 2026 9:48 AM IST
పోస్టర్లపై పేడ ముద్దలు...ఎన్టీఆర్ ఏఎన్నార్ ఏం చేశారంటే ?
X

యాభై అరవై దశకాలలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి అనేక సినిమాలలో నటించారు. ఈ ఇద్దరు 60 దశకం మధ్యలో నటించిన చిత్రం శ్రీక్రిష్ణార్జున యుద్ధం. ఇందులో ఎన్టీఆర్ క్రిష్ణుడిగానూ ఏఎన్నార్ అర్జునుడిగానూ నటించారు. ఇద్దరూ సమ ఉజ్జీలుగానే తమ పాత్రలు పోషించారు. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా వెండి తెర మీద కనిపిస్తే ఆ నిండైన రూపం చూసి అంతా ఆ వైపే ఆకర్షితులు అయ్యారు. ఇక ఆయన పక్కన ఉంటూ అక్కినేని అర్జునుడిగా ఎంత బాగా చేసినా జనాలలో చర్చ శ్రీక్రిష్ణుడి మీదనే ఉందని ఆ రోజులలో అక్కినేని ఫ్యాన్స్ లో చర్చ జరిగిందని అంటారు. దాంతో ఈ సినిమా తరువాత అక్కినేని పౌరాణికాలు చేయలేదు. అంతే కాదు ఎన్టీఆర్ తోనూ కాంబినేషన్ కుదరలేదు.

పదేళ్ళ తరువాతనే :

ఇక ఇది జరిగిన పదేళ్ళ తరువాత ఎన్టీఆర్ స్వయంగా అక్కినేనితో కలసి నటించాలని ఒక ప్రతిపాదన తెచ్చారు. తాను తీయబోయే దాన వీర శూర కర్ణ మూవీలో క్రిష్ణుడిగా నటించాలని కోరారట. అయిత క్రిష్ణ పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు కాబట్టి తాను నటించను అని అక్కినేని సున్నితంగా తిరస్కరించారుట. అదే సమయంలో మరో సబ్జెక్ట్ తెస్తే నటిస్తాను అన్నారట. అలా తయారైందే చాణక్య చంద్రగుప్త. ఈ సినిమాలో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. అక్కినేని చాణక్య పాత్రకు కూడా ఎంతో పేరు వచ్చింది. ఇలా మళ్ళీ ఈ కాంబో సెట్ అయింది. ఈ సినిమా తరువాత కూడా ఇద్దరి అభిమానుల మధ్య పోటా పోటీ వాతావరణం ఉండేది. ఒకరి సినిమా పోస్టర్ల మీద మరో ఫ్యాన్స్ వారు పేడ ముద్దలు వేసి కంగాళీ చేయడం ఆ రోజులలో ఎక్కువగా కనిపించేది.

ఈసారి సోషల్ మూవీతో :

దాంతో ఫ్యాన్స్ మధ్య విభేదాలు తగ్గించి తాము ఇద్దరమూ ఒక్కటే అని అన్నదమ్ములమని చాటి చెప్పేందుకు ఎన్టీఆర్ అక్కినేని ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ సోషల్ మూవీలో నటించాలని నిర్ణయించారు. గుండమ్మ కధ తరువాత మళ్ళీ 15 ఏళ్ళకు ఒక సాంఘీక చిత్రంలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు అనగానే ఆ రోజులలో అది పెద్ద సంచలనం అయింది. ఆనాటి ప్రఖ్యాత నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించి జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం పేరే రామక్రిష్ణులు. రామకృష్ణులు 1978 జూన్ 8న విడుదలైంది. లెజెండరీ హీరోలైన ఎన్ టీఆర్ అక్కినేని సరసన జయసుధ జయప్రద నటించారు.

అలా ఫ్యాన్స్ వార్ కి చెక్ :

ఇద్దరికీ సరిసమానంగా సీన్లూ పాటలు అన్నీ సెట్ చేసి పెట్టారు. అంతే కాదు ఆ రోజుల్లో ఫ్యాషన్లకు తగిన విధంగా డ్రెస్ లను కూడా ఈ ఇద్దరు హీరోలకు డిజైన్ చేసి ఇద్దరి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు. అలా ఇప్పటికి 48 ఏళ్ళ క్రిత్రం రిలీజ్ అయిన రామక్రిష్ణులు మంచి విజయం సాధించింది. అందులోని పాటలు సైతం అలరించాయి. అప్పటికి అయిదున్నర పదుల వయసులో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అక్కినేని ఎంతో హుషారుగా కుర్ర హీరోలకు పోటీగా బెల్ బాటంస్ వేసి మరీ జోరెత్తించారు. అలా తమ ఫ్యాన్స్ వార్ కి కూడా తెలివిగా చెక్ పెట్టేశారు అన్న మాట.