Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ జయంతి వేళ ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు.

By:  Tupaki Desk   |   28 May 2025 11:11 AM IST
ఎన్టీఆర్  జయంతి వేళ ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్!
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్నారు. కడపలో టీడీపీ మహానాడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

అవును... నేడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా... జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని అన్నారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారని.. మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజలవద్దకు తీసుకెళ్లారని.. కిలో రూ. 2 కే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చారని కొనియాడారు.

ఇదే సమయంలో.. సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రయాణం మహాశక్తిగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. సినీనటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మహానీయుడు ఎన్టీఆర్ ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్న లోకేష్.. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ‘ఎక్స్’ వేదికగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ విశిష్ట నటుడు, దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటున్నారని.. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా... తన స్నేహితుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చడానికి కృషి చేస్తోందని తెలిపారు.