కేంద్రం వద్ద పెండింగులో ఉపాధి హామీ బిల్లులు !
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఉపాధి పనులకు నిధులు రిలీజ్ అయ్యాయి. అయితే డిసెంబర్ తరువాత చేసిన పనులకు మాత్రం నిధులు పెండింగులో పెట్టారు.
By: Tupaki Desk | 13 April 2025 8:45 AM ISTజాతీయ ఉపాధి హామీ పధకం ఏపీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం 2005లో మొదలైన ఈ పధకం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాఊ అయ్యాక మరింత స్పీడ్ అందుకుంది. ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక ఒకేసారి అన్ని పంచాయతీలలో పనులకు ఆమోదముద్ర వేయించి గిన్నీస్ రికార్డు పొందేలా గ్రామ సభలను నిర్వహించారు.
దాంతో పల్లెలలో ఉపాధి పనులు పరుగులు అందుకున్నాయి. కేవలం పది నెలల కాలంలోనే వేల కోట్ల పనులు ఏపీ వ్యాప్తంగా జరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే చేసిన పనులకు వెంటనే నిధులను కేంద్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో ఉపాధి పనులకు నిధులు రిలీజ్ అయ్యాయి. అయితే డిసెంబర్ తరువాత చేసిన పనులకు మాత్రం నిధులు పెండింగులో పెట్టారు. ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అక్షరాలా 2090 కోట్ల రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 197 కోట్ల రూపాయలు, విజయనగరంలో 111 కోట్లు, ప్రకాశంలో 122 కోట్లు, తిరుపతిలో 118 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 113 కోట్లు ఇలా అత్యధిక చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయని అంటున్నారు.
పల్లె పండుగ పేరుతో చాలా జిల్లాలలో ఉపాధి హామీ పనులో కింద గ్రామాలలో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రోడ్లు, మినీ గోకులాలు వంటి పనులను పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే సకాలంలో బిల్లులు అందకపోవడంతో ఈ వర్కులు చేసిన కాంట్రాక్టర్లు అలాగే ఉపాధి హామీ కూలీలు సైతం ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
ఇక కాంట్రాక్టర్లు అయితే మంచి ఊపుతో ఉపాధి హామీ పధకం పనులను చేపట్టారు. వడ్డీలకు సైతం సొమ్ములు తెచ్చి మరీ వెచ్చించారు. ఇపుడు పనులు పూర్తి అయ్యాయి, రావాల్సిన నిధులు కేంద్రం వద్ద పెండింగులో పడ్డాయి. దాంతో సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఏపీని ఉపాధి హామీ పనులలో అగ్రభాగాన నిలపాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దానిని తగినట్లుగా సకాలంలో నిధులు విడుదల అయితే మరింతగా పల్లెలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. అంతే కాదు చాలా మందికి ఉపాధి దొరుకుతుందని ఏపీ దేశంలోనే ఈ పథకంలో ముందు వరసలో ఉంటుందని అంటున్నారు. మరి కేంద్రం నిధులను విడుదల చేయడమే ఆలస్యం అని అంటున్నారు.
