Begin typing your search above and press return to search.

వీసా అక్కర్లేదు.. మలేషియాకు విమానమెక్కేయొచ్చు

తాజాగా జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ మేరకు ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 9:47 AM GMT
వీసా అక్కర్లేదు.. మలేషియాకు విమానమెక్కేయొచ్చు
X

ఓ దేశానికి చెందిన ప్రజలు మరో దేశం వెళ్లాలంటే వీసాలు అవసరం. భారతీయులు విదేశాలకు వెళ్లాలన్నా వీసాలు కావాలి. కానీ కొన్ని దేశాలు మాత్రం మినహాయింపునిస్తుంటాయి. రెండు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు, పెట్టుబడులు, ఇతర కారణాలను పరిగణలోకి తీసుకుని వీసా లేకుండానే తమ దేశానికి వచ్చేందుకు అనుమతినిస్తుంటాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా కూడా చేరింది. భారత్, చైనా దేశాల ప్రజలు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించే అవకాశాన్ని ఆ దేశం కల్పించింది.

పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతినిచ్చింది. తాజాగా జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ మేరకు ప్రకటన చేశారు. మలేషియా ఆర్థికంగా డెవలప్ చెందాలంటే పర్యాటక రంగం డెవలప్మెంట్ ముఖ్యమని ప్రధాని అన్వర్ అన్నారు. ఇందులో భాగంగానే భారత్ తో పాటు చైనా పౌరులను తమ దేశానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే భారతీయులు మలేషియా వెళ్లొచ్చు. అక్కడ 30 రోజులు కూడా ఉండొచ్చు. మరోవైపు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఇటీవల భారతీయులకు వీసా అవసరం లేకుండానే తమ దేశాల్లో పర్యటించే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే థాయ్ లాండ్ వచ్చే ఏడాది మే 10 వరకు, శ్రీలంక మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాయి. డిమాండ్ పెరిగితే పొడిగిస్తామని థాయిలాండ్ పేర్కొంది.