Begin typing your search above and press return to search.

వైసీపీ మహిళా ఎంపీలకు నో టికెట్...!?

2019లో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి కేవలం ఇరవై ఆరేళ్ల వయసులోనే అరకు వంటి అతి పెద్ద లోక్ సభ స్థానం నుంచి రెండున్నర లక్షల పై చిలుకు భారీ ఓట్ల మెజారిటీతో గొడ్డేటి మాధవి ఘన విజయం సాధించారు.

By:  Tupaki Desk   |   7 March 2024 12:30 AM GMT
వైసీపీ మహిళా ఎంపీలకు నో టికెట్...!?
X

ఉత్తరాంధ్రాలో 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలలో ఇద్దరు మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే యాభై శాతం అన్న మాట. 2019లో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి కేవలం ఇరవై ఆరేళ్ల వయసులోనే అరకు వంటి అతి పెద్ద లోక్ సభ స్థానం నుంచి రెండున్నర లక్షల పై చిలుకు భారీ ఓట్ల మెజారిటీతో గొడ్డేటి మాధవి ఘన విజయం సాధించారు.

ఆమె ఓడించినది కూడా ఎవరితో కాదు సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని. ఆయన 1977లోనే మొదటిసారి ఎంపీ అయిన వారు. రాజకీయంగా అర్ధ శతాబ్దంపైగా అనుభవం ఉన్న కిశోర్ చంద్రదేవ్ ని మాధవి ఓడించి రికార్డు సృష్టించారు. ఇక ఆమెకు ఒక దశలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దక్కుతుందని ప్రచారం సాగింది.

అయిదేళ్ల పాటు ఆమె ఎలాంటి వివాదాలు లేకుండా తన ఎంపీ పదవిని నిర్వహించారు. ఇక 2024లో ఆమెను అసెంబ్లీకి పోటీకి దింపుతారు అని ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే ఆమెను అరకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఇంచార్జిగా నియమించారు. అయితే ఆమె నియామకం పట్ల వైసీపీలో పెద్ద ఎత్తున రగడ రేగింది.

ఈ పరిణామాలతో ఆమెను తప్పిచి మరో నేత మత్స్య రంగానికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో మాధవికి సీటు ఎక్కడ అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈసారి అరకు నుంచి ఎంపీ అభ్యర్ధిగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని పోటీ చేయిస్తున్నారు. పాడేరుకు కూడా కొత్త ఇంచార్జిని నియమించారు. అలా మాధవిని పక్కన ఉంచేశారు అన్న చర్చ సాగుతోంది.

ఆమె లాగానే 2019లో మరో మహిళా ఎంపీగా అనకాపల్లి నుంచి భీశెట్టి సత్యవతి గెలిచారు. ఆమె డాక్టర్ గా ఉంటూ సామాజిక సేవలో కీలకంగా ఉన్నారు. దాంతో అనూహ్యంగా ఆమెకు వైసీపీ టికెట్ ఇవ్వడం జగన్ వేవ్ లో గెలవడం జరిగిపోయాయి. ఆమె 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆ టికెట్ ని కాపు సామాజిక వర్గానికి చెందిన యువ నేత మలసాల భరత్ కుమార్ కి ఇస్తున్నారు.

అనకాపల్లి నుంచి ఎంపీగా సత్యవతి పేరుని పరిశీలించడంలేదు. మంత్రి గుడివాడ అమరనాధ్ ని పోటీ చేయిస్తారు అని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన కాకపోతే మాడుగులకు చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తో పాటు మరి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. దీంతో సత్యవతి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఈసారి ఉత్తరాంధ్రాలో ఇద్దరు మహిళలకు వైసీపీ ఎంపీలుగా టికెట్లు ఇస్తొంది. విశాఖ నుంచి బొత్స ఝాన్సీ, అరకు నుంచి కె భాగ్యలక్ష్మిలకు ఆ చాన్స్ దక్కుతోంది. మరి సిట్టింగ్ మహిళా ఎంపీలు మాజీలుగా మిగలాల్సిందేనా లేక జగన్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలుగా లేక ఇతర కీలక పదవులు అయినా ఇస్తారా ఆ హామీలు ఏమైనా ఉన్నాయా అన్నది వారి అనుచరులలో కూడా చర్చగా సాగుతోంది.