Begin typing your search above and press return to search.

విభజన తర్వాత రాజకీయాల్లో మలుపు..తెలుగు సీఎంల ఆ సంచలన కేసుకు

సరిగ్గా పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఆ కేసులో ఇద్దరు ప్రముఖులు.. ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థానాల్లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 2:43 PM IST
Note for Vote Case: 10 Years Later, Both Key Players Are Chief Ministers
X

సరిగ్గా పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఆ కేసులో ఇద్దరు ప్రముఖులు.. ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థానాల్లో ఉన్నారు. గతంలోనూ వీరిలో ఒకరు సీఎంగా ఉన్నప్పటికీ.. ఇద్దరూ ఒకేసారి పదవిలో ఉండగా కేసుకు పదేళ్లు పూర్తి కావడం గమనార్హం.

తెలంగాణ కోసం అత్యంత తీవ్రంగా సాగిన ఉద్యమం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో తెలుగు రాజకీయాలు రెండుగా మారిపోయాయి. అయితే, తెలంగాణ ఏర్పడిన సరిగ్గా ఏడాదిలోపే.. తొలి వార్షికోత్సవం జరుపుకోకముందే ఓ పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. అదే.. ఓటుకు నోటు కేసు.

2015 మే 31న చోటుచేసుకున్న పరిణామం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి తరఫున గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. అయితే, వేంకు మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వబోతుండగా ఏసీబీకి దొరికారన్నది అభియోగం. ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణలో ఉంది. పలుసార్లు రేవంత్ విచారణకు కూడా హాజరయ్యారు.

అయితే, 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయన.. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ విజయంతో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2015లో ఓటుకు నోటు కేసు నమోదైన సమయంలో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. 2024లో గెలిచి సీఎం అయ్యారు.

కాగా, చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ సీఎంలుగా ఉండగా ఓటుకు నోటు కేసు తేదీ (మే 31) రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ లో చంద్రబాబు పేరును ప్రస్తావించారు. ఏసీబీ చార్జిషీట్ లో మాత్రం లేదు. దీంతో ఆయన మీద చర్యలు చేపట్టలేదు.

హైదరాబాద్ పై హక్కు వదులుకునేలా...

ఓటుకు నోటు కేసు.. తెలంగాణను మించి ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ఈ కేసును చూపించే తెలంగాణ అప్పటి సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ నుంచి పంపించేశారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేసింది. ఉమ్మడి రాజధానిగా మరో తొమ్మిదేళ్లు హైదరాబాద్ లో కొనసాగే చాన్స్ వదిలేశారని పేర్కొంది. దీనికితగ్గట్లే 2015 అక్టోబరులో చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి.. అక్కడే నివాసం ఉండసాగారు. ఇక ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) కూడా ఉన్నారు. రేవంత్ ను మే 31న అరెస్టు చేయగా.. జూన్ 15న బెయిల్ వచ్చింది.