Begin typing your search above and press return to search.

హాలీవుడ్ మూవీ కాదు.. రియల్ గా ఆ దేశం ఇప్పుడు నేర ముఠాల చేతిలో!

ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 March 2024 4:33 AM GMT
హాలీవుడ్ మూవీ కాదు.. రియల్ గా ఆ దేశం ఇప్పుడు నేర ముఠాల చేతిలో!
X

ఒక చిన్న ప్రాంతాన్ని తమ అధీనంలో తీసుకోవటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లాంటివి ప్రపంచంలోని కొన్నిచోట్ల జరిగాయి. ఇలాంటి సన్నివేశాలకు హాలీవుడ్ మూవీస్ ఫేమస్. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతంలోని అంశాలు రీల్ కాదు రియల్. అవును.. ఒక దేశాన్ని నేర ముఠాలు కలిసి తమ అధీనంలోకి తీసుకోవటమే కాదు.. ఆరాచకాన్ని క్రియేట్ చేస్తూ ఆ దేశంలోని ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావటానికి సైతం జంకేలా చేస్తున్న అరుదైన సన్నివేశం ఆ దేశంలో చోటు చేసుకుంది. ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ ఆ దేశం ఏదంటారా? హైతీ.

కరేబియన్ దేశాల్లో అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా దీనికి పేరుంది. పది మిలియన్లకు (కోటి) పైగా జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పుడు ప్రభుత్వం.. పాలనా అన్నది లేదు. నడుస్తున్నదంతా ఆరాచకమే. కొన్ని నేర ముఠాల చేతిలో ఈ దేశం చిక్కుకుపోయిన విచిత్ర పరిస్థితి నెలకొంది. చరిత్రలోకి వెళితే.. 1492లో ఈ ద్వీపాన్ని స్పెయిన్ కనుగొన్న తర్వాత ప్రపంచానికి పరిచయమైంది. యూరోపియన్ దేశాల ఏలుబడిలో సాగిన ఈ దేశం 1804లో లాటిన్ అమెరికా దేశాల్లో మొదటి సార్వభౌమ దేశంగా అవతరించింది. ఈ దేశానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ఇక్కడి తోటల్లో పని చేయటానికి ఆఫ్రికా దేశాల నుంచి బానిసల్ని ఇక్కడకు తీసుకొచ్చి పని చేయించేవారు. అదే బానిసలంతా కలిసి తిరుగుబాటు చేయటం ద్వారా ప్రపంచంలో ఏర్పడిన తొలి స్వతంత్ర దేశంగా దీన్ని చెప్పాలి.

వర్తమానానికి వస్తే ఇప్పుడీ దేశం రాజధానితో సహా మొత్తం నేర ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజధాని ఎయిర్ పోర్టు నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోవటంతో.. తమకు సాయం చేయాలని కోరేందుకు పొరుగున ఉన్న కెన్యాకు సాయం కోసం వెళ్లిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ ఆ దేశంలోనే ఉండిపోయి.. తిరిగి స్వదేశానికి రాలేని దుస్థితిలో ఉన్నారు. హైతీలో దాదాపు 200లకు పైగా నేర ముఠాలు ఉన్నాయి. మరి.. ఇవన్నీ ఒకే తాటి మీదకు ఎలా వచ్చాయి? దీని వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. మాజీ పోలీసు అధికారి జిమ్మీగా చెప్పాలి.

అతగాడి నాయకత్వంలో నేర ముఠాలు దేశాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపిస్తున్న దుస్థితి. తనను వ్యతిరేకించిన ఎంతో మందిని సజీవ దహనం చేసిన రాక్షసత్వం జమ్మీ సొంతం. అందుకే అతడ్ని బార్బెక్యూగా వ్యవహరిస్తుంటారు. ఈ దేశంలోని అరాచకాన్ని చూసిన పలు ప్రపంచ దేశాలు.. అమెరికా .. ఐక్య రాజ్య సమితి ఒక నిర్ణయానికి వచ్చాయి. ముఠా లీడర్ల లావాదేవీలు.. కార్యకలాపాలపై ఆంక్షలు విధించాయి. దీంతో గ్యాంగుల్లో ప్రధానంగా ఉండే రెండు గ్యాంగులు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకొని దేశ ప్రధానిని గద్దె దింపేందుకు కుట్ర పన్నాయి. ఇంతకూ ఒక దేశాన్ని నేర ముఠాలు స్వాధీనం చేసుకోవటం వెనుక అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి.

తప్పుడు పనులకు పాల్పడుతున్న పోలీసు అధికారి జిమ్మీని ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత అతడు నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు.. నేతలు.. పారిశ్రామికవేత్తలు చేసే తప్పుడు పనులకు అండగా ఉంటామని చెప్పి.. నేరగాళ్లను వారి పనుల కోసం వినియోగిస్తూ మొదలు పెట్టిన దందా క్రమంగా అతి పెద్ద ముఠాను ఏర్పాటు చేసి.. దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేశారు. దేశ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీతో జిమ్మీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక దశలో జిమ్మీని దేశ ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది.

గత వారం హైతీ రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడి చేసి.. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించిన వైనం షాకిచ్చేలా మారింది. ఇప్పుడీ నేర ముఠాలు రాజకీయ పార్టీలను.. ఆయా నేతల్ని సైతం శాసిస్తున్నాయి. తమ బలం మరింతగా పెరగాలంటే రాజ్యాధికారం తమ చేతిలో ఉండాలన్న ఆలోచన చేస్తున్నాయి నేర ముఠాలు. ఇందులో భాగంగా ప్రధాని హెన్రీని పదవి నుంచి గద్దె దింపాయి. తాను దేశాన్ని పాలిస్తానని జిమ్మీ పరోక్షంగా చెప్పటమే కాదు.. విదేశీ బలగాలు తమ దేశంలోకి అడుగు పెట్టొద్దంటూ హుకుం జారీ చేశాడు. అంతర్జాతీయంగా తన పేరు మారుమోగాలని పలు విదేశీ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఇలా ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ దేశాన్ని ఒక క్రమ పద్దతిలో పెట్టేందుకు.. నేర ముఠాల లెక్క తేల్చేందుకు కెన్యా నేత్రత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపాలని అమెరికాతో సహా పలు దేశాలు నిర్ణయించాయి. ఇందుకు ఐక్య రాజ్య సమితి సైతం ఓకే చేసింది. కానీ.. కెన్యా కోర్టుల జోక్యంతో ఈ బలగాల ఆపరేషన్ ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ఏమైనా.. ఒక అసాధారణ పరిస్థితిని హైతీ ఎదుర్కోవటమే కాదు.. నేర ముఠాలను ప్రోత్సహిస్తే చిన్న దేశాలు ఎంతటి దుస్థితిలోకి వెళతాయన్న దానికి హైతీ ఇప్పుడో క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా మారిందని చెప్పక తప్పదు.