Begin typing your search above and press return to search.

నో సేఫ్టీ : విశాఖలో యాక్షన్ క్రైమ్ పిక్చర్ ...!

విశాఖలో రూరల్ విశాఖ తాశీల్దారు రమణయ్యను ఇంటికి వచ్చి మరీ దుండగులు ఇనుప రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 3:37 AM GMT
నో సేఫ్టీ : విశాఖలో యాక్షన్ క్రైమ్ పిక్చర్ ...!
X

విశాఖను నేర రాజధాని అనేశారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. ప్రతీ రోజూ ఎక్కడ ఏమి జరుగుతుందో అని ప్రజలు ప్రాణాలు పట్టుకుని విశాఖలో బతుకుతున్నారు అని ఆయన అంటున్నారు. విశాఖలో రూరల్ విశాఖ తాశీల్దారు రమణయ్యను ఇంటికి వచ్చి మరీ దుండగులు ఇనుప రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.

ఈ వార్తను వినడంతోనే విశాఖ జనాలు వణికిపోయారు. విశాఖలో నేరాలు లేవా అంటే గతంలోనూ ఉన్నాయి. కానీ విశాఖ నడిబొడ్డు అనాల్సిన మధురవాడ వద్ద అపార్ట్మెంట్ లో అయిదవ అంతస్తులో నివాసం ఉంటున్న తహశీల్దారు రమణయ్యను వాచ్ మేన్ ఫోన్ ద్వారా అపార్ట్మెంట్ సెల్లార్ వద్దకు పిలిపించి మరీ దుండగులు దారుణంగా హత్య చేశారు.

ఇది దావానలంగా సిటీలో పాకిపోయింది. ఆయన మండల స్థాయి మెజిస్ట్రేట్. అంటే అక్కడ న్యాయమూర్తి లాంటి వారు. ఫుల్ పవర్స్ ఉన్న అధికారి. అలాంటి అధికారినే ఏమీ కాకుండా చంపేశారు అంటే విశాఖలో ఏమి జరుగుతోంది అన్నది చర్చకు వస్తోంది.

దీనికి కాస్తా వెనక్కి వెళ్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేశారు. అది ఒక క్రైం థ్రిల్లర్ గా నాడు తలపించింది. ఒక విధంగా సంచలనం రేకెత్తించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే పవర్ ఫుల్ లీడర్, బిల్డర్ అయిన ఎంవీవీ ఫ్యామిలీనే టార్గెట్ చేశారు అంటే క్రైం రేటు టాప్ రేంజికి విశాఖలో చేరుకుందని విపక్షాలు విమర్శించాయి.

ఇపుడు సీన్ కట్ చేస్తే ఏకంగా తాశీల్దార్ నే హత్య చేశారు. అది కూడా జనవాసాల మధ్యలో. దీంతో విపక్షం విమర్శిస్తోంది అని కాదు కానీ ఈ సిటీకి ఏమైంది అన్న చర్చ వస్తోంది. విశాఖ కూల్ అండ్ పీస్ ఫుల్ సిటీగా పేరు పొందింది. విభజన తరువాత నుంచి విశాఖకు కష్టాలు మొదలయ్యాయని చెప్పారు.

ఎందుకంటే ఏపీలో అతి పెద్ద మెగా సిటీ విశాఖ కావడమే. విశాఖలో గజం స్థలం ఏ మూల ఉన్నా లక్షల్లో ధర పలుకుతోంది. టీడీపీ హయాంలోనూ భూకబ్జాలు పెరిగాయి. వైసీపీ హయాంలో అవి పీక్స్ కి చేరాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే సీన్ ఏర్పడింది అని అంటున్నారు.

విశాఖలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి అంటే అసైండ్ భూములకు హక్కులు కల్పించడం 22 ఏ కింద ఉన్న భూములకు క్లియరెన్స్ ఇచ్చేసి వాటికి హక్క్లు ఇవ్వడంతో భూకబ్జాదారులకు దాహం ఎక్కువ అవుతోంది. ప్రతీ భూమి మీద కన్ను పడుతోంది. అందుకే వారు అధికారుల మీద వత్తిడి తెచ్చి మరీ అనుకూలంగా చేయించుకుంటున్నారు అని విమర్శలు ఉన్నాయి.

దారుణ హత్యకు గురి అయిన రూరల్ విశాఖ తాశీల్దారు విషయానికి వస్తే రమణయ్య ఉన్న ప్రాంతంలో ఆయన పరిధిలో భూములు అత్యంత ఖరీదు అయినవి ఉన్నాయని అంటున్నారు. పైగా సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధాని అని వస్తున్న ప్రచారం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విశాఖ అభివృద్ధి వంటివి కూడా కబ్జాకోర్లకు విశాఖను యాపిల్ పండుగా కంటికి ఇంపుగా చూపిస్తేస్తున్నాయి.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వీలైనంత వేగంగా 22 ఏ కింద ఉన్న భూములను తమ ఖాతాలో మార్చుకోవాలని దందా బ్యాచ్ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని అధికారుల మీద వత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. బెదిరింపులు వస్తున్నాయి.ఇపుడు ఏకంగా వారిని లేపేసే దాకా యాక్షన్ క్రైమ్ పిక్చర్ ని విశాఖలో చూపించేస్తున్నారు.

అందుకే మాజీ మంత్రి గంటా అన్నట్లుగా విశాఖను క్రైమ్ క్యాపిటల్ అందామా అన్న చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఫోకస్ చేస్తోంది. అలా విశాఖ హాట్ అండ్ బ్యూటీ సిటీగా మారింది. అదే సమయంలో విశాఖ సేఫ్టీ కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. ఆ రెండవది పెద్దగా లేదు అనడానికే ఈ దారుణాలు అని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల వేళ ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గా చూడాలని విపక్షాలు అంటున్నాయి.