Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు 'బేషరతు మద్దతు'.. కిమ్ సంచలన ప్రకటన

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా బేషరతు మద్దతు ప్రకటించింది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 10:26 AM IST
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు బేషరతు మద్దతు.. కిమ్ సంచలన ప్రకటన
X

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా బేషరతు మద్దతు ప్రకటించింది. బుధవారం ప్యోంగ్యాంగ్‌లో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగుతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేస్తున్న పోరాటంలో తాము బేషరతుగా అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రష్యా-ఉత్తర కొరియా అధికారిక మీడియా ధృవీకరించింది.

కిమ్ మాట్లాడుతూ.."ఉక్రెయిన్‌తో యుద్ధంతో సహా అన్ని కీలక అంతర్జాతీయ రాజకీయ సమస్యలు, విదేశాంగ విధానాలపై రష్యా వైఖరికి ఉత్తర కొరియా బేషరతుగా మద్దతు ఇస్తుంది" అని తెలిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై నాయకులు చర్చించారు. ముఖ్యంగా యుద్ధం వల్ల దెబ్బతిన్న కుర్స్క్ ప్రాంతం పునర్నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. ఈ ఏడాది షోయిగు ఉత్తర కొరియాను సందర్శించడం ఇది రెండోసారి. మార్చిలో జరిగిన భేటీలో కూడా రష్యా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే పోరాటంలో అండగా ఉంటామని కిమ్ ప్రకటించారు.

గత ఏప్రిల్‌లో, రష్యా తరపున తమ దళాలు ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్నాయని ఉత్తర కొరియా ధృవీకరించింది. దీనికి కొన్ని రోజుల ముందే రష్యా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా, ఉత్తర కొరియా మధ్య ఉన్న పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని రష్యా పేర్కొంది. అయితే, ఎంత మంది సైనికులు పాల్గొంటున్నారనే వివరాలు వెల్లడించలేదు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్, దక్షిణ కొరియా అధికారులు గతంలో 10-12 వేల మందికి పైగా సైనికులు ఉండవచ్చని అంచనా వేశారు. దీనికి ప్రతిఫలంగా రష్యా కిమ్‌కు అధునాతన ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ అందిస్తోందిని నివేదించింది.

గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించి, ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రస్తుతం ఇస్తాంబుల్‌లో జరుగుతున్నాయి. ఈ చర్చలు ఏ మలుపు తిరుగుతాయో, రష్యా-ఉత్తర కొరియా బంధం ఈ యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.