Begin typing your search above and press return to search.

కిమ్ రాజ్యంలోని కొత్త కళకు కండిషన్స్ మొదలైపోయాయిగా..!

ఈ క్రమంలో.. 'రిసార్ట్‌ బీచ్‌'ను ఫ్యామిలీతో పాటు సందర్శించిన కిమ్‌.. తాము ఇటీవల చేపట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని కొనియాడారు.

By:  Tupaki Desk   |   19 July 2025 10:15 AM IST
కిమ్  రాజ్యంలోని కొత్త కళకు కండిషన్స్  మొదలైపోయాయిగా..!
X

ఇటీవల దేశంలో పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కిమ్‌.. వొన్సన్‌ కల్మా తీరంలో 'రిసార్ట్‌ బీచ్‌' పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో.. 54 హోటళ్లు, సినిమా హాళ్లు, పబ్‌ లు, వాటర్‌ పార్కులతోపాటు అనేక సదుపాయాలు ఉన్నాయి. సుమారు 20 వేల మంది పర్యటకులకు ఆతిథ్యం ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో.. 'రిసార్ట్‌ బీచ్‌'ను ఫ్యామిలీతో పాటు సందర్శించిన కిమ్‌.. తాము ఇటీవల చేపట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని కొనియాడారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు టూరిజం జోన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో రష్యన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమయంలో దీనికి సంబంధించి ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఉత్తర కొరియా ఇటీవల వోన్సాన్ కల్మా బీచ్ రిసార్ట్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూలై 1న స్థానిక పర్యాటకులకు తెరవబడింది.. తార్వాత రష్యన్ సందర్శకుల బృందాన్ని ఆహ్వానించింది. ఇటీవల విదేశీ సందర్శకుల మొదటి బృందాన్ని స్వాగతించిన అనంతరం.. జూలై 17న విదేశీ పర్యాటకులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉత్తర కొరియా పర్యాటక వెబ్‌ సైట్ డీపీఆర్ కొరియా టూర్ వోన్సాన్ కల్మా పర్యాటక సముదాయం.. "తాత్కాలికంగా విదేశీ పర్యాటకులను స్వీకరించడం లేదు" అని ప్రకటించింది. ఆ దేశ అధికారుల ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఇంకా తెలియదు కానీ... దీనికి సంబంధించి అనేక ప్రచారాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... అంతర్జాతీయ పర్యాటకుల సస్పెన్షన్‌ కు రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌ రోవ్‌ తో కలిసి ఉత్తర కొరియాను సందర్శించిన రష్యన్ జర్నలిస్ట్‌ సూచనలు కారణం అనే కథనాలు తెరపైకి వస్తున్నాయి! మరోవైపు.. రష్యన్ పర్యాటకులకు ఇప్పటికీ అనుమతి ఉంటుంది.. కానీ కొన్ని పరిస్థితులలో మాత్రమే అని వెల్లడించింది!

కాగా... కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఉత్తర కొరియా దేశ సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి సుదీర్ఘ కాలంపాటు ఈ ఆంక్షలు కొనసాగాయి. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల తర్వాత వీటిని ఇటీవల తెరిచినట్లే తెరిచి.. తాజాగా విదేశీ పర్యాటకులకు నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.