కిమ్ రాజ్యానికి కొత్త కళ... రిసార్ట్ బీచ్ లు, పబ్ లు, ఇంకా...!
ఈ క్రమంలోనే... 'రిసార్ట్ బీచ్' పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టును పూర్తి చేశారు. తాజాగా దాన్ని పరిశీలించారు.
By: Tupaki Desk | 30 Jun 2025 10:30 AM ISTఉత్తర కొరియాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకెలాంటి నిబంధనలు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేని పరిస్థితి. అక్కడ కిమ్ అవునంటే అవును.. కాదంటే కాదు! ఈ శతాబ్ధంలోనూ నియంతృత్వాన్ని అధికారికంగా పక్కాగా అమలుచేస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా పర్యాటకంపై దృష్టి పెట్టి, అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ ప్రాజెక్టును చేపట్టారు.
అవును... కిమ్ రాజ్యానికి కొత్త కళ వచ్చింది. నిత్యం నిబంధనల గురించి, నియంతృత్వం గురించి మాట్లాడుకునే రాజ్యంలో కోవిడ్ మహమ్మారి తర్వాత సరిహద్దు ద్వారాలు ఇటీవలే తెరుచుకున్న వేళ.. టూరిజం పై నియంత దృష్టి సారించారు. ఈ క్రమంలోనే... 'రిసార్ట్ బీచ్' పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టును పూర్తి చేశారు. తాజాగా దాన్ని పరిశీలించారు.
ఈ క్రమంలో... దేశంలో పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కిమ్.. వొన్సన్ కల్మా తీరంలో 'రిసార్ట్ బీచ్' పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో.. 54 హోటళ్లు, సినిమా హాళ్లు, పబ్ లు, వాటర్ పార్కులతోపాటు అనేక సదుపాయాలు ఉన్నాయి. సుమారు 20 వేల మంది పర్యటకులకు ఆతిథ్యం ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. నూతనంగా నిర్మించిన 'రిసార్ట్ బీచ్'ను ఫ్యామిలీతో పాటు సందర్శించిన కిమ్.. తాము ఇటీవల చేపట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని కొనియాడారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు టూరిజం జోన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఈ రిసార్ట్ బీచ్ ప్రారంభ కార్యక్రమంలో రష్యన్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇక ఈ ప్రాంతానికి రైలు, అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా ఉంది. జులై 1 నుంచి దేశీయ పర్యటకులను ఇక్కడ అనుమతించనున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటకులకు అవకాశం ఇస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే... రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాల మేర... అక్కడి పర్యటకులకు అవకాశం ఉండొచ్చని అంటున్నారు.
కాగా... కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఉత్తర కొరియా దేశ సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి సుదీర్ఘ కాలంపాటు ఈ ఆంక్షలు కొనసాగాయి. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల తర్వాత వీటిని ఇటీఅల తెరిచారు.
