రాకెట్లతో ఉరిమిన ఉత్తర కొరియా.. ప్రపంచం గుండెలపై మరో సంక్షోభం!
ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది.. ఓవైపు హమాస్, హెజ్బొల్లా, హూతీలతో పోరాడుతూనే పెద్ద దేశం ఇరాన్‌తోనూ తలపడుతోంది ఇజ్రాయెల్
By: Tupaki Desk | 19 Jun 2025 10:05 PM ISTఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది.. ఓవైపు హమాస్, హెజ్బొల్లా, హూతీలతో పోరాడుతూనే పెద్ద దేశం ఇరాన్‌తోనూ తలపడుతోంది ఇజ్రాయెల్. ఇది ఓ విధంగా ప్రపంచ సంక్షోభమే..! ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావణకాష్ఠంలా మూడున్నరేళ్లుగా రగులుతూనే ఉంది. అణుబాంబు ప్రయోగం హెచ్చరికలు.. క్షిపణి దాడులు ముగిసిపోయి.. ఇప్పుడు ఒక దేశంపైకి మరో దేశం మిడతల దండులాంటి డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ యుద్ధం ఎప్పుడైనా పేలే అగ్ని పర్వతంలాంటిదే అన్న సంగతి మర్చిపోవద్దు.
ఇలాంటి సమయంలో మరో పెను ప్రమాదం ముంచుకొస్తుందా? అనిపిస్తోంది. ఇరాన్, రష్యా కంటే చాలా ప్రమాదకరమై దేశం ఇందులో భాగం కానుందా? అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పైకి ప్రజాస్వామ్య దేశాలుగా కనిపించే ఇరాన్, రష్యా ఎంత యుద్ధమైనా కాస్త సంయమనం పాటించగలవు. అయితే, ఈ మాత్రం నిబ్బరం లేని దేశం ఉత్తర కొరియా. కారణం.. దీని అధినేత నియంత కిమ్ జోంగ్ ఉన్. కిమ్‌కు తిక్కరేగితే ఎంతటి పని అయినా చేస్తాడు. అతడు ఎంత చెబితే అంత కాబట్టి.. అతడిని అడ్డుకునేవారు లేరు కాబట్టి.
ఇంతకూ ఏం చేశాడు..?
ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు చాలవన్నట్లు ఉత్తర కొరియా ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యకు దిగింది. పలు రాకెట్ లాంచర్లతో గురువారం పది రాకెట్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దాని దాయాది దక్షిణ కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపం నుంచి ఉత్తర దిశగా వీటిని ప్రయోగించింది. ఇదంతా ఎందుకు చేస్తున్నది అంటే..? బుధవారం దక్షిణ కొరియా అమెరికా, జపాన్‌లతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది. షార్ట్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించడంతో ఉత్తర కొరియాకు అనుమానం వచ్చింది. అంతే.. తోక తొక్కిన తాచులా క్షిపణి ప్రయోగాలకు దిగింది.
దక్షిణ కొరియా, జపాన్‌లో గణనీయమైన సంఖ్యలో అమెరికా సైనికులు ఉన్నారు. ఉత్తర కొరియాను బూచిగా చూపుతూ 28,500 మంది సైనికులను దక్షిణ కొరియాలో ఉంచింది అమెరికా. ఇక జపాన్‌లో అమెరికా త్రివిధ దళాలతో పెద్ద దళం ఉంది. ఇదంతా ప్రాంతీయ భద్రత, ఉత్తర కొరియా నుంచి తలెత్తే ముప్పును నివారించడానికే అని చెబుతుంది అమెరికా. ఈ రెండు దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు కూడా చేస్తుంటుంది.
