Begin typing your search above and press return to search.

పశ్చిమాసియాలో పరిస్థితులపై కిమ్ రాజ్యం కీలక వ్యాఖ్యలు!

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉదృతంగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 4:00 PM IST
పశ్చిమాసియాలో పరిస్థితులపై కిమ్  రాజ్యం కీలక వ్యాఖ్యలు!
X

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో.. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉదృతంగా మారుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఈ యుద్ధంలోకి అమెరికా నేరుగా అడుగుపెట్టింది. ఇరాన్‌ లోని అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్యం విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో కిమ్ రాజ్యం ఉత్తర కొరియా స్పందించింది.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతోనే పశ్చిమాసియా రగిలిపోతుంటే.. ఆ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చి ఆ మంటల్లో పెట్రోల్ పోసినంత పనిచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా.. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలను ప్రపంచ దేశాల నుంచి వెలువడుతున్నాయి.

ఇలా ఇరాన్ పై అమెరికా దాడులు చేయడంపై ఉత్తరకొరియా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్‌ కారణమని మండిపడింది. ఈ దాడులు ఒక సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలను, ప్రాదేశిక హక్కులను ఉల్లంఘించడమనేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఉత్తర కొరియా విదేశాంగ శాఖ.. ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులను ఉత్తర కొరియా తప్పుబడుతోందని.. అమెరికా, ఇజ్రాయెల్‌ ఘర్షణాత్మక చర్యలను అంతర్జాతీయ సమాజం కూడా గట్టిగా ఖండించాలని పిలుపునిచ్చింది. నిరంతర యుద్ధ ఎత్తుగడలు, ప్రాదేశిక విస్తరణను పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడింది.

కాగా... ఇరాన్‌, ఉత్తర కొరియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... బాలిస్టిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడం విషయంలో ఈ ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా సైనిక సహకారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ వద్ద ఇప్పటికే సుమారు 2000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది.

సుమారు మూడు రోజుల ముందు కూడా ఇజ్రాయెల్ పై ఉత్తరకొరియా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమెరికా, పాశ్చాత్య దేశాల అండదండలతో ఉన్న ఇజ్రాయెల్.. పశ్చిమాసియాలో శాంతికి కేన్సర్ లాంటిదని, ప్రపంచ శాంతి భద్రతలను నాశనం చేయడంలో ప్రధాన దోషి అని సంచలన ఆరోపణలు చేసింది.