చైనాలో మరో ‘కరోనా’.. 100 మంది విద్యార్థులకు నరకం
చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. గంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషన్ లోఉన్న హై స్కూల్ లోని 100 మంది విద్యార్థులు నోరో వైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.
By: Tupaki Desk | 18 Jan 2026 2:17 PM ISTచైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. గంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషన్ లోఉన్న హై స్కూల్ లోని 100 మంది విద్యార్థులు నోరో వైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మెడికల్ టీమ్స్ ను పంపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఆ పరిసరాలను శుభ్రం చేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. నోరో వైరస్.. గతంలో కూడా భారత్ లోని పూణే, కేరళలో బయటపడినట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల ప్రాణాపాయం తక్కువే అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత వైరస్ ల వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నోరో వైరస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నోరో వైరస్ ఎలా సోకుతుంది..
ఈ వైరస్ ఆహారం, నీరు, లేదా వ్యక్తుల ద్వారా సోకుతుంది. సోకిన తర్వాత వేగంగా వ్యాపిస్తుంది. దీని వల్ల తీవ్రమైన నీరసం, డయేరియా, డీహైడ్రేషన్ కలుగుతుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటుంది. డీహైడ్రేషన్ గురికావడం తీవ్రమైన సమస్య. అది శరీరంలోని నీటి శాతాన్ని తొందరగా తగ్గించేస్తుంది. 1968లో అమెరికాలో నోరో వైరస్ ను మొదటిసారి గుర్తించారు. నోరో వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం, కలుషిత నీరు తాగడం వల్ల నోరో వైరస్ సోకడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే సమయంలో నోరో వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండటం కారణంగా నోరో వైరస్ సోకుతుంది. కాబట్టి ఆహారం, నీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే సోకిన వారికి దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఎందుకంటే నోరో వైరస్ చాలా వేగంగా సోకుతుంది.
నోరో వైరస్ అంటే ..
నోరో వైరస్ కేవలం కడుపుపైన ప్రభావం చూపుతుంది. అందుకే దీనిని స్టమక్ ఫ్లూ అంటున్నారు కానీ ఇది `ఫ్లూ` లాగా ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థపైన ప్రభావం చూపదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతోంది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 685 మిలియన్ ప్రజలు దీని బారిన పడతారు. ఇళ్లల్లో ఉన్న డెస్క్ మీద, డోర్ లపైన కూడా నోరో వైరస్ ఉండగలదు. శానిటైజర్ తో పూర్తీగా వైరస్ ను నిర్మూలించలేరు. కానీ జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. అదే సమయంలో లక్షణాలు కనిపించగానే వైద్యున్ని సంప్రదించడం ద్వారా తీవ్రతను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..
తిన్న తర్వాత, వాష్ రూమ్ వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నోరో వైరస్ సోకిన వ్యక్తికి దూరంగా ఉండటమే కాకుండా వారి ఆహారానికి, వస్తువులకు దూరంగా ఉండాలి. తద్వారా వైరస్ ను అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి గురించి, జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రజలు సూచిస్తున్నారు.
