అమెరికా దిగ్బంధనాన్ని దాటిన రష్యన్ కుబేరుడి నౌక.. హర్మూజ్‌లో ‘నార్డ్’ సాహసం..!
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది.
By: Tupaki Political Desk | 28 April 2026 12:31 PM ISTప్రస్తుత పరిస్థితుల్లో ఒక నౌక అది ఏదైనా కావచ్చు.. హర్మూజ్ జలసంధి దాటడం అంత ఈజీ కాదు.. అలాంటివి ఒక బిలియనీర్ నౌక హర్మూజ్ ను దాటింది.. ఆ బిలియనీర్ ఎవరు? హర్మూజ్ అంత ఈజీగా ఎలా దాటాడు.. తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు. అమెరికా దిగ్బంధనాన్ని కాదని ఒక బిలియనీర్ నౌక హర్మూజ్ దాటడం అంతర్జాతీయ పెను సంచలనమే. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ఈ ‘నార్డ్’ యాట్ ప్రయాణం కేవలం ఒక విలాసవంతమైనది మాత్రమే కాదు. ఇది రష్యా-ఇరాన్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు సంకేతం.
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. అమెరికా-ఇరాన్ వివాదం నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. అటువంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు అలెక్సీ మోర్దాషావ్‌కు చెందిన ‘నార్డ్’ అనే సూపర్‌యాట్ అత్యంత ధైర్యంగా ఈ జలసంధిని దాటడం చర్చనీయాంశమైంది. 500 మిలియన్ డాలర్ల విలువైన ఈ నౌక, అమెరికా ఆంక్షలను, దిగ్బంధనాన్ని లెక్కచేయకుండా దుబాయ్ నుంచి మస్కట్ చేరుకోవడం వెనుక అంతర్జాతీయ సమీకరణలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సముద్రంపై తేలియాడే రాజభవనం
నార్డ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోని అతిపెద్ద యాట్‌లలో ఒకటిగా నార్డ్ గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో 20 లగ్జరీ సూట్ రూమ్‌లు, ఒక భారీ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. కేవలం విలాసమే కాదు.., భద్రత కోసం ఇందులో ఒక హెలీప్యాడ్, ఒక మినీ జలాంతర్గామి ఉండడం విశేషం. యుద్ధ వాతావరణంలో కూడా సురక్షితంగా ప్రయాణించేలా రూపొందించారు. అధికారికంగా ఇది రష్యన్ కంపెనీ పేరు మీద ఉన్నా, దీని వెనుక పుతిన్ నమ్మకస్తుడైన మోర్దాషావ్ ఉన్నారని అమెరికా గట్టిగా నమ్ముతోంది.
అమెరికా దిగ్బంధనాన్ని ఎలా దాటింది..?
హర్మూజ్ జలసంధిపై అమెరికా గట్టి నిఘా ఉంచినప్పటికీ, ఈ నౌక సులభంగా దాటడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇరాన్, రష్యాలు ప్రస్తుతం అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. అమెరికా దిగ్బంధనాన్ని ధిక్కరిస్తూ రష్యన్ నౌకలకు ఇరాన్ రక్షణ కల్పించి ఉండవచ్చు. ఇది ఒక పౌర విలాస నౌక కావడంతో, సైనిక పరమైన దాడులు జరగకుండా మినహాయింపు లభించి ఉండవచ్చు. దుబాయ్ నుంచి బయలుదేరి ఒమన్ (మస్కట్) చేరుకోవడంలో ఈ ప్రాంతంలోని ఇతర దేశాల వ్యూహాత్మక మౌనం కూడా తోడ్పడి ఉండవచ్చు.
ఆంక్షల మధ్య రష్యన్ కుబేరుల పాట్లు
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా, ఐరోపా దేశాలు రష్యన్ బిలియనీర్లపై తీవ్రమైన ఆంక్షలను విధించాయి. వారి విదేశీ ఆస్తులను, ముఖ్యంగా విలాసవంతమైన యాట్‌లను స్వాధీనం చేసుకుంటున్నాయి. గతంలో కూడా ఈ నౌక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి హాంకాంగ్, వ్లాడివోస్టాక్ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధిని ఎంచుకోవడం ద్వారా, ఆంక్షలు విధించే దేశాలకు మోర్దాషావ్ బహిరంగ సవాలు విసిరారు.
నార్డ్ యాట్ హర్మూజ్ దాటడం కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు.. అది అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు నిదర్శనం. అమెరికా తన దిగ్బంధనాన్ని ఎంత కట్టుదిట్టం చేసినా, రష్యా-ఇరాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రపంచంలో చమురు రవాణాకు కీలకమైన ఈ ప్రాంతంలో, ఒక రష్యన్ నౌక స్వేచ్ఛగా తిరగడం అమెరికా ఆధిపత్యానికి ఒక పరీక్ష వంటిది. మస్కట్ చేరుకున్న ఈ నౌక తదుపరి గమ్యం ఎటో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
