పాక్ ఎయిర్ బేస్ లో పాక్ కు అనుమతి లేదు... తెరపైకి షాకింగ్ ఇష్యూ!
అవును... పాకిస్థాన్ రక్షణ విశ్లేషకుడు ఇంతియాజ్ గుల్ ఓ షాకింగ్ విషయం తెరపైకి తెచ్చారు.
By: Tupaki Desk | 9 Jun 2025 8:15 AM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో అటు పాక్ లోని ఉగ్ర శిబిరాలు, ఇటు ఆ దేశ సైనిక స్థావరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దూకుడు పెంచిన భారత్.. పాక్ లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.. ఈ సమయంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి కాల్పుల విరమణ ప్రకటన చేసింది. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అవును... పాకిస్థాన్ రక్షణ విశ్లేషకుడు ఇంతియాజ్ గుల్ ఓ షాకింగ్ విషయం తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... రావల్పిండిలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉందని అన్నారు. దీంతో... అమెరికా – పాకిస్థాన్ మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఏ మేరకు సైనిక సహకారం ఉంది వంటి విషయాలు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇదే సమయంలో... వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ వైమానిక స్థావరంలోని కార్యకలాపాల్లో పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారులు కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదని గుల్ వ్యాఖ్యానించారు. ఆ ఎయిర్ బేస్ వద్ద చాలాసార్లు అమెరికన్ విమానాలు కనిపించాయని.. అయితే వాటిలోపల జరిగే కార్యకలాపాలు.. లేదా, ఆ విమానాల్లో ఉన్న సరుకు గురించి ఎవరికీ తెలియదని తెలిపారు.
దీంతో.. ఆ రెండు దేశాలు ఒక అప్రకటిత ఒప్పందాన్ని కలి గుండవచ్చని.. ఇది దేశ సైనిక పారదర్శకతపై ఆందోళనలను రేకెత్తిస్తుందని గుల్ సూచించినట్లు జాతీయమీడియా ఉంటంకించింది. పైగా... ఈ వైమానిక స్థావరం ఇస్లామాబాద్, రావల్పిండి సమీపంలో ఉండటంతో పాక్ లో ఇది చాలా ముఖ్యమైనదని తెలిపింది.
కాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో.. నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే! ఈ ఆపరేషన్ ఆ వైమానిక స్థావరాన్ని దెబ్బతీసిందనే ప్రకటనలు వినిపించాయి! అయితే.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో పాక్ సైన్యం, ప్రభుత్వం నోరు మెదపలేదు.
పైగా సరిగ్గా పాకిస్థాన్ పై భారత్ వైమానిక దాడులు పెంచి, బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించి, అక్కడ పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే.. అమెరికా వైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటన రావడంతో.. ఇంతియాజ్ గుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుతుందని అంటున్నారు. ఈ కాల్పుల విరమణకు అమెరికా ఆత్రుత చూపించడం వెనుక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అసలు కారణమా అనే చర్చ ఇప్పుడు మొదలైంది!