Begin typing your search above and press return to search.

ఫోన్ విడిచేస్తే రూ.8 లక్షలు.. అదెలానంటే?

మీ స్మార్ట్ ఫోన్ ను నెల రోజుల పాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షల భారీ ప్రైజ్ మనీ ఇస్తామని చెబుతోంది సిగ్గీస్ డైరీ అనే కంపెనీ.

By:  Tupaki Desk   |   27 Jan 2024 7:49 AM GMT
ఫోన్ విడిచేస్తే రూ.8 లక్షలు.. అదెలానంటే?
X

విన్నంతనే వావ్ అనేసేలాంటి ఆఫర్ గా దీన్ని చెప్పాలి. ఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్ అన్నది శరీరంలో భాగంగా మారటం తెలిసిందే. ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని పరిస్థితి. నిద్ర లేచిన క్షణం నుంచి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు పక్కనే ఉండే ఫోన్ తోనే గడిపే మనిషికి అమెరికాకు చెందిన ఒక కంపెనీ విచిత్రమైన సవాల్ విసిరింది.

మీ స్మార్ట్ ఫోన్ ను నెల రోజుల పాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షల భారీ ప్రైజ్ మనీ ఇస్తామని చెబుతోంది సిగ్గీస్ డైరీ అనే కంపెనీ. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోవటం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ కారణంగా పిల్లల చదువుల మీద తీవ్ర ప్రభావం పడుతున్న విషయాన్ని సదరు కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వాడకంపై అందరిలో అవగాహన పెంచే కార్యక్రమానికి తెర తీసింది.

అందరు తమ కాన్సెప్టు గురించి మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఆసక్తికర సవాల్ విసిరింది. అమెరికన్ కుర్రకారు ఎవరైనా సరే.. తమ స్మార్ట్ ఫోన్ ను 30 రోజుల పాటు వాడకుండా ఉండే రూ.8లక్షల భారీ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. అయితే.. ఇందుకు చాలానే ప్రొసీజర్ ఉంది. ఊరికే రూ.8లక్షల రావు కదా? కంపెనీ విసిరిన సవాల్ కు ఓకే చెబితే.. సదరు కంపెనీ వెబ్ సైట్ లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి.

అనంతరం డిజిటల్ డిటాక్స్ అవసరం తెలియజేస్తూ ఒక వ్యాసం రావాలి. పోటీకి ఎంపికైన వారికి ఒక కీప్యాడ్ ఫోన్ (అదేనండి సెల్ ఫోన్ మొదట్లో ఉండేది కదా అదే).. దాని సిమ్ కూడా వాళ్లే ఇస్తారు. రెగ్యులర్ గా వాడే స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టి.. సదరు కంపెనీ ఇచ్చిన బేసిక్ ఫోన్ ను మాత్రమే వాడాలి. అలా విజయవంతంగా నెల రోజుల పాటు చేసిన వారికి తాము ప్రకటించిన ప్రైజ్ మనీని ఇస్తామని చెబుతోంది కంపెనీ. ఇప్పటికే అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ పూర్తైందని.. త్వరలోనే పోటీ మొదలవుతుందని చెబుతున్నారు. ఆన్ లైన్ లో వైరల్ గా మారిన ఈ పోటీ తమ దేశాల్లో కూడా పెడితే బాగుండన్న మాట పలువరి నోట వినిపిస్తోంది.