Begin typing your search above and press return to search.

తొలిరోజు నామినేషన్‌ వేసిన కీలక నేతలు... లోకేష్ కు ముహూర్తం ఎవరు పెట్టారంటే...?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది

By:  Tupaki Desk   |   18 April 2024 10:26 AM GMT
తొలిరోజు నామినేషన్‌ వేసిన కీలక నేతలు... లోకేష్ కు ముహూర్తం ఎవరు పెట్టారంటే...?
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. ఈ క్రమలో తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో ఆఫీసులకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. దీంతో అసలు సిసలు ఎన్నికల కోలాహలం మొదలైనట్లు కనిపిస్తుంది!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైపోయింది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్‌ లో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్‌ ను.. ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. ఈయనదే తొలి నామినేషన్ అని ఎన్నికల కమిషన్ అధికారికంగా వెబ్‌ సైట్‌ లో పేర్కొంది.

ఇదే క్రమంలో... ఏపీలోని ఒంగోలు లోక్‌ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే... విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, అదే నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వర రెడ్డి ఒకేరోజు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ పత్రాలను ఆర్వోకి సమర్పించారు.

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. టీడీపీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నారు. ఇదే క్రమంలో... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే... మల్కాజిగిరి లోక్‌ సభ నియోజకవర్గానికి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేయగా.. మహబూబ్‌ నగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ లోక్‌ సభ అభ్యర్థిగా బీజేపీ తరుపున శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే క్రమంలో... భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు.

లోకేష్ కు ముహూర్తం పెట్టిన త‌మిళ‌నాడు పురోహితులు!:

ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలవాలని ఫిక్సయిన నారా లోకేష్.. మరోసారి మంగళగిరి నుంచే బరిలోకి దిగితున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గుంటూరు జిల్లాలో తొలి నామినేష‌న్ వేసేందుకు సిద్ధమ‌య్యారు. ఈ క్రమంలో పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బ‌య‌లు దేరి వెళ్లారు. నారా లోకేష్‌.. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖ‌ర్ తో క‌లిసి మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేయ‌నున్నారు.

కాగా, నారా లోకేష్ నామినేష‌న్ కార్యక్రమానికి త‌మిళ‌నాడులోని శ్రీరంగనాథ స్వామి ఆల‌య పూజారులు ముహూర్తం పెట్టిన‌ట్టు తెలుస్తోంది!