Begin typing your search above and press return to search.

ఆయన తో పెట్టుకుంటే ఎంతటి వారైనా ఖతమే

దాదాపు 25 ఏళ్లుగా రష్యాను ఎదురులేకుండా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్.. తన ప్రత్యర్థులను ఏమాత్రం ఎదగనివ్వలేదన్నది వాస్తవం.

By:  Tupaki Desk   |   18 Feb 2024 2:41 PM GMT
ఆయన తో పెట్టుకుంటే ఎంతటి వారైనా ఖతమే
X

ఆయనకు వ్యతిరేక -నిరసన గళం అంటే నచ్చదు.. అత్యంత కర్కశంగా దాన్ని నొక్కేస్తారు.. అది స్వదేశంలో అయినా విదేశంలో అయినా.. దగ్గరి వారయినా.. ప్రత్యర్థులయినా.. ఆయనకు ఎదురుతిరిగారంటే మళ్లీ బయట తిరగలేరు.. కొన్నాళ్ల తర్వాత ఈ భూమ్మీదే తిరగలేరు.. ప్రముఖులు కావడంతో బయటి ప్రపంచానికి తెలిసిన మరణాలు కొన్నే.. తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో?..

దాదాపు 25 ఏళ్లుగా రష్యాను ఎదురులేకుండా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్.. తన ప్రత్యర్థులను ఏమాత్రం ఎదగనివ్వలేదన్నది వాస్తవం. తాజాగా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం అత్యంత సంచలనమైంది. నావల్నీని చంపించింది పుతినేనని ఆయన భార్య, అమెరికా, కెనడా ఆరోపిస్తున్నాయంటే పరిస్థితి ఏమిటో తెలిసిపోతోంది. ఈ ఒక్కటే కాదు.. రష్యాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలూ వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మాజీ గూఢచారి అయిన పుతిన్.. తన వ్యతిరేక గళాలను ఇలా చాకచక్యంగా హతమార్చుతున్నారన్న ఆరోపణలున్నాయి.

ప్రధాని నుంచి జర్నలిస్టు వరకు..

పుతిన్ జమానాలో ప్రాణాలు కోల్పోయిన ఆయన వ్యతిరేకుల్లో ప్రధానిగా పనిచేసిన నాయకుడితో పాటు ఓ జర్నలిస్టూ ఉండడం గమనార్హం. బోరిస్ నెమత్సోవ్ అనే నాయకుడు రష్యాకు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన పుతిన్ విరోధి. 2015లో క్రెమ్లిన్‌ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద నెమత్సోవ్ ను కొందరు కాల్చి చంపారు. దీనిపై చెచెన్‌ కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేసినా.. అసలు నిందితులెవరో తేలకపోవడం గమనార్హం. ఇంతకూ బోరిస్ చేసిన పాపం ఏమంటే.. పుతిన్ ను తరచూ విమర్శిస్తూ, 2014లో క్రిమియాను ఉక్రెయిన్‌ నుంచి రష్యా ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో పాల్గొనడం. ఇక రష్యన్‌ మహిళా జర్నలిస్ట్‌ అన్నా పొలిట్ కోవ్ స్కాయ 2006లో తన అపార్ట్‌మెంట్‌లోనే హత్యకు గురయ్యారు. పుతిన్ విధానాలను ఎండగట్టేవారీమో. చెచెన్ నేత రంజాన్ కదిరోవ్‌ నూ తూర్పారపట్టేవారు.

టీ తాగినంత సులువుగా..

అలెగ్జాండర్‌ లిట్వినెంకో.. ఇతడు రష్యన్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ ఏజెంట్‌. 1999లో జరిగిన మాస్కో అపార్ట్‌మెంట్‌ బాంబు దాడులకు పుతిన్‌ కారణమని ఆరోపించాడు. అంతేగాక ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించేవాడు. అన్నాను చంపిన ఏడాదే.. లండన్‌ లో ఇద్దరు రష్యన్‌ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత అలెగ్జాండర్ చనిపోయాడు. టీలో విషం కలపడంతోనే అతడు చనిపోయినట్లు కథనాలు వచ్చాయి.

గాల్లోనే ఖతం..

ప్రిగోజిన్.. పుతిన్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు. పుతిన్ చెఫ్ గా అతడిని అందరూ చెప్పేవారు. అలాంటి ప్రిగోజిన్ నిరుడు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి అయిన ఇతడు.. ఉక్రెయిన్ యుద్ధంలో మొదట రష్యాకు సహకరించాడు. ఏమైందో ఏమో.. అనూహ్యంగా పుతిన్ పై తిరుగుబాటు చేశాడు. మాస్కో దిశగా తన అనుచరులతో దూసుకెళ్లాడు. కానీ తర్వాత వెనక్కుతగ్గాడు. కొన్ని నెలల వ్యవధిలోనే విమానం కూలిపోయి ప్రాణాలొదిలాడు. పుతిన్ పగ ఎంతగా ఉంటుందంటే.. ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత బెలారస్ లో ఆశ్రయం పొందాడు. సంధి పేరిట బయటకు పిలిపించి మరీ చంపించాడు. విమాన ప్రమాదంలో ఇతడితో పాటు అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

భారత్ లోనూ ఒకరు..

పుతిన్ ను విభేదించిన నాయకులు, వ్యాపారవేత్తలు ‘ఆత్మహత్య’ చేసుకోవడం గమనార్హం. వ్యాపారి, ఎంపీ ఆంటోవ్‌ 2022 డిసెంబరులో భారత్ లోని ఒడిశాలో ఉన్న రాయగడ హోటల్‌ లో చనిపోయాడు. దీనికి కొద్దిగా ముందు రష్యా నౌకా రంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ బుజెకోవ్‌ ఒక సబ్‌మెరైన్‌ ఫ్లోటింగ్‌ ఫంక్షన్‌లో మృతి చెందాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లుక్‌ ఆయిల్‌ ఛైర్మన్‌ రావిల్‌ మాగ్నోవ్‌.. గది కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్‌ యుద్ధం రెండో రోజే గ్యాజ్‌ప్రామ్‌ యూనిఫైడ్‌ సెటిల్మెంట్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ట్యూల్కోవ్‌ అనుమానాస్పదంగా చనిపోయాడు.

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైంది. అప్పటినుంచి పుతిన్‌ విమర్శకుల్లో 19 మంది చనిపోయారు. ఇవన్నీ ఆత్మహత్యలు, ప్రమాదాలు అని చెబుతున్నారు. అయితే, ఈ 19 మందితో పాటు చనిపోయినవారంతా పుతిన్ తో విభేదించినవారే.