Begin typing your search above and press return to search.

పాతికేళ్లు నిండకుండానే ప్రపంచాన్నే చుట్టేసిన భారతీయ యువకుడు!

బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన 24 ఏళ్ల శుభమ్ కుమార్, సోషల్ మీడియాలో 'నోమాడ్ శుభమ్'గా అందరికి తెలిసిన వాడు.

By:  Madhu Reddy   |   2 March 2026 5:25 PM IST
పాతికేళ్లు నిండకుండానే ప్రపంచాన్నే చుట్టేసిన భారతీయ యువకుడు!
X

బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన 24 ఏళ్ల శుభమ్ కుమార్, సోషల్ మీడియాలో 'నోమాడ్ శుభమ్'గా అందరికి తెలిసిన వాడు. అత్యంత చిన్న వయసులోనే భూమిపై ఉన్న 197 దేశాలను చుట్టేసిన ఘనుడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా, ఆసియా వాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం భారతీయ పాస్‌పోర్ట్‌పై, అతి తక్కువ సౌకర్యాలతో ఆయన పదేళ్లుగా కొనసాగించిన ఈ ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ విశేషాలు ఇలా వున్నాయి..

ముంగేర్ నుండి ప్రపంచం దాకా...ఒక సాహసోపేత ప్రయాణం:

శుభమ్ కుమార్ ప్రయాణం తన యుక్తవయసులోనే మొదలైంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచం చూడాలనే తపనతో ఇంటి నుంచి బయలుదేరాడు. విమానాల్లో కంటే ఎక్కువగా లిఫ్టులు అడుగుతూ, లోకల్ బస్సుల్లో ప్రయాణిస్తూ, సామాన్యుల ఇళ్లలో బస చేస్తూ తన ఖర్చులను తగ్గించుకునేవాడు. దాదాపు 10 ఏళ్ల పాటు ఖండాలను దాటుతూ, ఎన్నో సంస్కృతులను చూస్తూ ఆయన సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణం ఎట్టకేలకు 197 దేశాల మార్కును చేరుకుంది. తన ప్రయాణ విశేషాలను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ లక్షలాది మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు.

గత రికార్డులు.. శుభమ్ చేసిన మ్యాజిక్ ఏంటి:

ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయడం అనేది మాటలు కాదు. గతంలో లెక్సి ఆల్‌ఫోర్డ్ అనే అమెరికన్ యువతి 21 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇక అలాగే భారత్ నుండి గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారున్నా, 24 ఏళ్లకే అన్ని దేశాలను పూర్తి చేయడం, అది కూడా కేవలం 'భారతీయ పాస్‌పోర్ట్' తో సాధించడం శుభమ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. చాలా దేశాల్లో వీసా రాకపోయినా, పట్టుదలతో ప్రయత్నించి తన కలను ఇతను నిజం చేసుకున్నాడు.

భారతీయ పాస్‌పోర్ట్‌పై సాధారణంగా ఇన్ని దేశాలు తిరగడం అసాధ్యమని చాలామంది భావిస్తారు. కానీ శుభమ్ దాన్ని తప్పని నిరూపించాడు. భిన్నమైన వాతావరణ పరిస్థితులను, వీసా ఆంక్షలు, భాషా సమస్యలు, ఎదుర్కొంటూ ఆయన సాధించిన ఈ విజయం అరుదైనది. "ప్రపంచం చాలా పెద్దది, కానీ మన మనసులో దృఢ నిశ్చయం ఉంటే ఏదీ అసాధ్యం కాదు" అని ఆయన నిరూపించాడు. ఇప్పుడు 197 దేశాల యాత్ర పూర్తి కావడంతో, శుభమ్ సాధించిన ఈ మైలురాయి భారతీయ ట్రావెలర్స్ చరిత్రలో ఒక గోల్డెన్ పేజీగా నిలిచిపోతుంది అంటున్నారు నిపుణులు.