Begin typing your search above and press return to search.

'ఫేమస్' పిచ్చికి భారీగా ఫైన్ తో షాకిచ్చిన పోలీసులు!

వీరి వీడియోలు వైరల్ కావటమే కాదు.. పండుగల పేరు చెప్పి ఇంతటి అరాచకమేంటన్న మాట పలువురి నోట వ్యక్తమైంది

By:  Tupaki Desk   |   26 March 2024 3:51 AM GMT
ఫేమస్ పిచ్చికి భారీగా ఫైన్ తో షాకిచ్చిన పోలీసులు!
X

ఏదో ఒకటి చేయాలి. నలుగురిలో నానాలి. ఫేమస్ అయిపోవాలి. సిగ్గు.. శరం.. మానం.. అభిమానం.. లాంటి పదార్థాల్ని వదిలేసే కొందరి పిచ్చిఎంత పీక్స్ కు చేరిందన్న దానికి నిదర్శనంగా హోలీ వేడుకల వేళ నోయిడా రోడ్ల మీద ఇద్దరు యువతులు చేసిన ఆరాచక రీల్స్ ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఈ చిట్టివీడియోలు చూశాక.. పండుగల వేళ ఇలాంటి పాడు పనులేంటన్న మాట ఒకవైపు.. పండుగల పవిత్రతను.. దాని ఉద్దేశాలను పక్కదారి పట్టించేలా ఉన్న వీరి తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తంకావటం తెలిసిందే.

నోయిడా రోడ్ల మీద టూ వీలర్ ను ఒక యువకుడు డ్రైవ్ చేస్తుంటే.. వెనుక కూర్చున్న ఇద్దరి యువతుల అశ్లీల చేష్టలు ఎంతటి వికారాన్ని క్రియేట్ చేశాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సరిపోదన్నట్లుగా.. మరో రీల్ లో ఈ ఇద్దరు యువతులు నడి రోడ్డు మీద జగుప్స కలిగించే రీతిలో చేసిన చేష్టలపైనా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. వీరి వీడియోలు వైరల్ కావటమే కాదు.. పండుగల పేరు చెప్పి ఇంతటి అరాచకమేంటన్న మాట పలువురి నోట వ్యక్తమైంది.

ఈ వ్యవహారంపై నోయిడా పోలీసులు సైతం రియాక్టు అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోల ఆధారంగా టూ వీలర్ మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఈ ముగ్గురికి రూ.33వేలు ఫైన్ విధిస్తూ ఫైన్ వేశారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు తాము తీసుకున్న చర్యల గురించి సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తెలియజేయటం గమనార్హం.

అయితే.. పోలీసుల చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ.. తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానిస్తే.. వారు చేసిన అతికి ఈ ఫైన్ షాక్ సరిపోతుందా? అన్న ప్రశ్నను సంధించటం గమనార్హం. ఇంకొందరు మాత్రం మరీ ఎక్కువ ఫైన్ వేశారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ ముగ్గురు చేసిన అతికి పోలీసులు విధించిన ఫైన్ చాలా చిన్నదని.. వీరిపై న్యూసెన్సు కేసు పెట్టటంతో పాటు.. క్రిమినల్ చర్యలు చేపడితే ఈ తరహా రీల్స్ కు చెక్ పడుతుందన్న మాట వినిపిస్తోంది.