నోయిడా వాసుల ఫన్నీ, ఫైటింగ్ నిరసన.. వీధి కుక్కలకు 'పోటీ'గా ఆవులు
నివాసితులలో ఒకరైన రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. వీధి కుక్కలు సొసైటీ లోపల ఉండడంతో వాటికి ఆహారం పెట్టగలిగితే, ఆవులకు కూడా అదే విధంగా చూసుకోవాలి అని అన్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 1:00 AM ISTవీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని సూపర్‌టెక్ ఎకోవిలేజ్-2 అనే హౌసింగ్ సొసైటీ నివాసితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ సొసైటీ లోపల ఒక ఆవుల షెల్టర్‌ను ప్రారంభించారు. చాలా మంది నివాసితులకు కుక్కలు కరిచి గాయాలవడం, సొసైటీ నిర్వహణ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కుక్కల బెడద తీవ్రత
నివాసితులు చెప్పిన దాని ప్రకారం.. కుక్కలను ప్రేమించే కొందరు వ్యక్తులు సొసైటీ లోపల వాటికి ఆహారం పెట్టే స్థలాలను ఏర్పాటు చేయడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వీధి కుక్కలు సొసైటీ అంతటా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మెయింటెనెన్స్ సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన నివాసితులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కుక్కలు ఉంటే ఆవులు కూడా ఉండాలి
నివాసితులలో ఒకరైన రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. వీధి కుక్కలు సొసైటీ లోపల ఉండడంతో వాటికి ఆహారం పెట్టగలిగితే, ఆవులకు కూడా అదే విధంగా చూసుకోవాలి అని అన్నారు. ప్రస్తుతం టవర్ సీ4 ముందు పచ్చగడ్డి, ఇతర అవసరాలతో ఆవుల కోసం ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. ఈ ఆవుల షెల్టర్, ఇంతకుముందు సొసైటీ బయట తిరుగుతున్న వీధి పశువులను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కోతులు, ఇతర జంతువులు కూడా
రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆవుల షెల్టర్ ఒక ప్రతీకారంగా చేపట్టిన నిరసన అని మెయింటెనెన్స్ వాళ్లకు, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి ఇది ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిస్తుందని అన్నారు. కుక్కల సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరసనను మరింత తీవ్రతరం చేయడానికి కోతులకు అరటిపండ్ల వంటివి పెట్టడం కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
