నగరాల్లో ఇల్లు కొనే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో!
ఇటీవల నోయిడాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ మాత్రం దానికే ఖరీదైన అపార్టు మెంట్లు షేక్ అయ్యాయి.
By: Tupaki Desk | 24 May 2025 11:08 AM ISTనగరాలు.. మహానగరాల్లో ఇళ్లు కొనాలని భావించే ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూడాల్సిందే. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కొనే ఇంటి విషయంలో నిర్మాణదారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ అపార్టుమెంట్లు నిలుస్తాయి. ఒక్క వర్షం దెబ్బకు తలుపులు ఊడిపోవటం.. గోడలకు రంధ్రాలు పడిపోవటం లాంటివి చూస్తే.. పూరి గుడిసె సైతం వర్షానికి బలంగా నిలుస్తుంది కదా? అన్న భావన కలుగక మానదు.
ఇటీవల నోయిడాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ మాత్రం దానికే ఖరీదైన అపార్టు మెంట్లు షేక్ అయ్యాయి. అందులోని కొన్ని ప్లాట్ల గోడలు బీటలు వారితే.. మరికొన్ని ప్లాట్లు ఏకంగా కిటికీలు.. తలుపులు.. గోడలు ఆగమాగం కావటం చూసినోళ్లకు నోటి మాట రాని పరిస్థితి. భారీ భవంతుల జీవితకాలం తక్కువలో తక్కువ యాభై ఏళ్లు ఉంటాయి. అందుకు భిన్నంగా ఇంత భారీగా డ్యామేజ్ జరగటం చూస్తే.. నాణ్యత విషయంలో ఆ నిర్మాణ సంస్థలు ఎంత ఘోరంగా వ్యవహరించాయన్నది ఇట్టే అర్థమవుతుంది.
డబ్బులు దండుకోవటం తప్పించి నాణ్యమైన నిర్మాణాల్ని చేపట్టని వైనం.. అది కూడా పేరున్న నిర్మాణ సంస్థల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నోయిడా విషయానికి వస్తే తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఇందుకు తగ్గట్లే ఇళ్ల నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా నోయిడాలోని సూపర్ టెక్ ఎకోవిలేజ్ లోని ఇంటి బాల్కనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వర్షం ధాటికి తమ ఇల్లు ఎంతలా దెబ్బ తిందన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా కుటుంబం పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంది. ఇంటి నిర్మాణం ఇంత నాసిరకంగానా?’ అంటూ ఆవేదన చెందుతూ పెట్టిన పోస్టు షాకింగ్ గా మారింది. జేపీ అమర్ సొసైటీలోని ఒక అపార్టు మెంట్ లో అయితే గాలుల ధాటికి కిటికీ ఊడిపడిపోవటం గమనార్హం. ఖరీదైన ఇళ్ల నిర్మాణం ఇలానా చేసేది? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి..దీనిపై అధికారులు.. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
