నరకం చూపిస్తున్నారు.. ఇక్కడ నుండీ తీసుకెళ్ళండి!
నేటి సమాజంలో ఎన్ని చట్టాలు వస్తున్నా, వరకట్న వేధింపులకు అమాయక యువతులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా నోయిడాలో జరిగిన ఒక ఘోర సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.
By: Madhu Reddy | 18 May 2026 11:35 PM ISTనేటి సమాజంలో ఎన్ని చట్టాలు వస్తున్నా, వరకట్న వేధింపులకు అమాయక యువతులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా నోయిడాలో జరిగిన ఒక ఘోర సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. "అత్తింట్లో నా జీవితం నరకంగా మారింది.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి" అంటూ తన తల్లికి ఆఖరి మెసేజ్ పంపి, ఓ మాజీ మిస్ పుణే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి.
డేటింగ్ యాప్ పరిచయం.. పెళ్లి:
నోయిడాకు చెందిన ట్విష (33) గతంలో 'మిస్ పుణే'గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో ఆమెకు భోపాల్‌కు చెందిన అడ్వకేట్ సమర్థ్‌తో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది డిసెంబర్ (2025) లో వారిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి కొన్ని రోజులకే కష్టాలు మొదలయ్యాయి.
తల్లికి వచ్చిన ఆఖరి మెసేజ్:
పెళ్లయిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం అత్తింటి వారు ట్విషను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మానసిక, శారీరక వేధింపులు భరించలేకపోయిన ఆమె.. చనిపోవడానికి ముందు తన తల్లికి ఒక ఎమోషనల్ మెసేజ్ పంపింది. "అత్తింట్లో నా జీవితం నరకంలా ఉంది.. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లండి" అని ఆ మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె శవమై కనిపించడం కలకలం రేపింది.
అటాప్సీ రిపోర్ట్‌లో నమ్మలేని నిజాలు:
ట్విష మరణంపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతురిని అత్తింటివారు దారుణంగా హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా వచ్చిన అటాప్సీ (పోస్ట్‌మార్టం) రిపోర్ట్ ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఆమె శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని, అంతకంటే వినలేని ఘోరం ఏంటంటే, ఆమె బతికుండగానే ఉరి వేశారని రిపోర్ట్‌లో తేలడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
నిపుణులు చెబుతున్న మాట ఇదే:
సమాజంలో ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నా, అమ్మాయిలు బలిపశువులు అవుతూనే ఉన్నారని సామాజిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంధాలు, పెళ్లిళ్ల పేరుతో జరిగే వేధింపుల విషయంలో మొదటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సమస్య పెద్దదయ్యే వరకు ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా.. వేధింపులు మొదలైన తొలిరోజుల్లోనే తల్లిదండ్రులకు చెప్పడం లేదా చట్టపరంగా లీగల్ సపోర్ట్ తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాణనష్టాలను ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడిగా మారిన ఈ ఘటన చదువుకున్న సమాజానికి ఒక హెచ్చరిక. అందాల పోటీల్లో గెలిచిన ఒక ప్రతిభావంతురాలైన యువతి, వరకట్న పిశాచుల చేతిలో ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. ఇక ఈ కేసులో దోషులకు కఠినమైన శిక్ష పడినప్పుడే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
