మన దేశంలోనూ గన్ కల్చర్.. నోయిడా ‘బిట్’లో ఏపీ విద్యార్థి హత్య
ఉత్తరప్రదేశ్ లోని ‘బిట్’ క్యాంపస్ లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ ఎంబీఏ చదువుతున్న తెలుగు విద్యార్థిని సహాధ్యాయి దారుణంగా కాల్చి చంపాడు.
By: Tupaki Desk | 10 Sept 2025 10:09 AM ISTవిదేశాల్లో కనిపించే గన్ కల్చర్ మన దేశంలోనూ విస్తరిస్తుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు పెన్ను బదులు ‘గన్’ పట్టుకుంటున్నట్లు తాజా ఘటనలు బయటపెడుతున్నాయి. దీంతో ఈ విదేశీ జాఢ్యాన్ని ముందుగా గుర్తించి అణిచివేయాని డిమాండ్ వినిపిస్తోంది. ఏపీకి చెందిన విద్యార్థి ఒకరు ఈ గన్ కల్చర్ కు బలైపోవడం భయాందోళన పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ‘బిట్’ క్యాంపస్ లో చోటుచేసుకున్న ఈ సంఘటనతో విద్యారంగం ఉలిక్కి పడింది.
ఉత్తరప్రదేశ్ లోని ‘బిట్’ క్యాంపస్ లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ ఎంబీఏ చదువుతున్న తెలుగు విద్యార్థిని సహాధ్యాయి దారుణంగా కాల్చి చంపాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (23) నోయిడాలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ లో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌదరి అతడికి రూమ్ మేట్ గా చెబుతున్నారు. బుధవారం ఏమైందో కానీ, ఈ ఇద్దరు ఉన్న రూములో కాల్పులు జరిగాయి.
హాస్టల్ లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ గదికి వెళ్లారు. అప్పటికే దీపక్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్నట్లు గుర్తించారు. అక్కడే దేవాన్ష్ కూడా తీవ్ర గాయాలతో కనిపించాడు. ఇద్దరూ ఒకే రూములో ఉండటం, గదికి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం వల్ల దేవాన్ష్ గన్ తో దీపక్ పై కాల్పులు జరిపి, అనంతరం తాను కాల్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఉదంతంతో కాలేజీ వర్గాలతోపాటు విద్యావేత్తలు ఉలిక్కిపడ్డారు. కాలేజీ క్యాంపస్ లోకి గన్ ఎలా వచ్చిందనేది అంతుచిక్కడం లేదని అంటున్నారు.
ప్రశాంతంగా చదువుకోవాల్సిన చోట విద్యార్థులు గన్ పట్టుకుని తిరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేవాన్ష్ కు గన్ అవసరం ఏంటి? అతడు ఎప్పుడు ఆ గన్ ను కాలేజీకి తీసుకువెళ్లాడు. అది ఎవరు అతడికి ఇచ్చాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటన యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని అంటున్నారు.
