Begin typing your search above and press return to search.

దీదీ మూర్ఖత్వం.. అత్యున్నత అధికారులకు శాపం కానుందా?

తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అసాధారణ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు.. తాను చెడింది కాకుండా.. రాష్ట్ర కార్యనిర్వహక వ్యవస్థను కలిపి చెడగొట్టిన పరిస్థితి.

By:  Garuda Media   |   9 March 2026 1:00 PM IST
దీదీ మూర్ఖత్వం.. అత్యున్నత అధికారులకు శాపం కానుందా?
X

పాలకుల మొండితనం అధికారులకు శాపంగా మారుతుంటుంది కొన్నిసార్లు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అసాధారణ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు.. తాను చెడింది కాకుండా.. రాష్ట్ర కార్యనిర్వహక వ్యవస్థను కలిపి చెడగొట్టిన పరిస్థితి. ప్రస్తుతానికి దీదీకి పడే దెబ్బ కంటే.. ముఖ్యమంత్రి మేడం చెప్పినట్లుగా ఫాలో అయిన అత్యున్నత స్థాయి అధికారులు మొదలు ఒక మోస్తరు అధికారులు భారీ మూల్యం చెల్లించే పరిస్థితి ఎదురు కానుంది. దీనికి సంబంధించిన తాఖీదులు అందుకున్న పరిస్థితి.

పశ్చిమ బెంగాల్ లో సంతాల్ గిరిజన సదస్సు వేదికను.. ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చిన తీరును ప్రశ్నించిన కేంద్రం..దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రోటోకాల్ కు సంబంధించిన బ్లూ బుక్ రూల్స్ ను ఎందుకు ఫాలో కాలేదో తమకు తెలియజేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు మంత్రులు ఎవరూ స్వాగతం పలకలేదు. ఇది మాత్రమే కాదు.. రాజకీయ నేతల బాటలో రాష్ట్ర సీఎస్.. డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాకపోవటం బ్లూబుక్ నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. అంతేకాదు. రాష్ట్రపతికి కేటాయించిన వాష్ రూమ్ లో నీటి సౌకర్యం లేకపోవటం.. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేసిన వైనంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్.. సిలిగురి పోలీసు కమిషనర్.. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ వివరాలు తమకు అందించాలని ఆదేశించిన వైనం చూస్తే.. దీదీ మొండితనం ఏమో కానీ.. అత్యున్నత స్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి అధికారుల మీద దెబ్బ పడటం ఖాయం. పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతికి ఎదురైన చేదు అనుభవంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పదించటంతో పాటు.. కేంద్రం సైతం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.

బెంగాల్ లో నిర్వహించిన సంతాల్ గిరిజన సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రితో సహా జిల్లా కలెక్టర్ వరకు ఎవరూ వెళ్లకపోవటం ఒక ఎత్తు అయితే.. వెన్యూను సైతం చివర్లో మార్చేయటం.. వాష్ రూం వసతి లేని ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించేలా చేయటం ద్వారా.. సీఎం మమతా బెనర్జీ తాను అనుకున్నది అనుకున్నట్లు చేశారు.

ఈ తీరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఖండించటంతో పాటు.. సీఎం మమతను చెల్లెలుగా పేర్కొంటూ.. ఆమె వైఖరిపై అసంత్రప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు సామాన్యుల విషయంలో కాస్త అటు ఇటు అయినా ఫర్లేదు. చర్యలు చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే అంతో ఇంతో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. కానీ.. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతి విషయంలో దీదీ అసాధారణ స్థాయిలో వ్యవహరించిన వైనానికి మాత్రం ఆమె.. ఆమె టీం భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.