Begin typing your search above and press return to search.

దేశంలో ఏ రాష్ట్ర‌మూ.. ఏపీకి సాటి లేదు: చంద్ర‌బాబు

దేశంలోని ఏ రాష్ట్ర‌మూ ఏపీకి సాటి లేద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబ‌డు లు, ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగాలు.. ఇలా ఏవిధంగా చూసినా.. ఏపీ దూసుకుపోతోంద‌ని తెలిపారు.

By:  Garuda Media   |   23 Feb 2026 9:09 AM IST
దేశంలో ఏ రాష్ట్ర‌మూ.. ఏపీకి సాటి లేదు: చంద్ర‌బాబు
X

దేశంలోని ఏ రాష్ట్ర‌మూ ఏపీకి సాటి లేద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబ‌డు లు, ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగాలు.. ఇలా ఏవిధంగా చూసినా.. ఏపీ దూసుకుపోతోంద‌ని తెలిపారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డంలో రాష్ట్రం నెంబ‌ర్‌-1 స్టేట్‌గా నిలిచింద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. తాము ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌నుకొంద‌రు గేలి చేశార‌ని.. ఇవ్వ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించార‌ని.. కానీ, దానిని సూప‌ర్ హిట్ చేశామ‌ని.. పేద‌ల క‌ళ్ల‌లో ఆనందాన్ని నింపామ‌ని చెప్పారు.

వారింకా క‌ళ్లు తెర‌వ‌లేదు!

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి క‌ల్ప‌న జ‌రుగుతున్నా.. ఇంకా ఏమీలేద‌ని చెబుతున్న‌వారు.. ఇంకా క‌ళ్లు తెరుచుకోలేద‌న్నారు. 11 సంఖ్య‌కు ప‌రిమితం అయిన త‌ర్వాత‌.. వారింకా ఆషాక్ నుంచి మేల్కోలేక పోతున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ వ్యాప్తంగా ఎక్క‌డా అమ‌లు కాని విధంగా ప్ర‌తి నెలా 1వ తేదీనే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను ఇస్తున్నామ‌న్న ఆయ‌న‌.. తల్లికి వందనం పేరుతో మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం చేస్తున్నామ‌న్నారు. ఇన్ని చేస్తున్నా.. వారు ఇంకా తెలుసుకోలేక పోతున్నార‌న్నారు.

సంతృప్త స్థాయి పెరిగింది..

రాష్ట్రంలో ప్ర‌జ‌ల సంతృప్త స్థాయిలు పెరిగాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. పేద‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ‌ర‌కు కూట‌మి స‌ర్కారు పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. ర‌హ‌దారుల నిర్మాణం నుంచి ఉద్యోగాల క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ ప్ర‌జ‌లు ఆనందంగా ఉన్నార‌ని తెలిపారు. మ‌రింత మెరుగైన పాల‌న అందించేందుకు తాము కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ బాధ్య‌త మాదే..!

ప్ర‌జ‌లను ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో నివ‌సించేలా చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌తి మండ‌లంలోనూ ఒక స్వ‌చ్ఛ‌రథం ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇది వారానికి ఒక‌సారి మండ‌ల‌ప‌రిధిలోని అన్ని గ్రామాల్లోనూ ప‌ర్య‌టించి.. ఇంటింటి నుంచి చెత్త‌ను సేక‌రిస్తుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛ ర‌థాల‌ను సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు.