అక్కడ తాళి కట్టే వరకు ఫోన్ లో మాట్లాడుకోవడం నిశిద్దం..
పత్రికల ద్వారా లేదా ల్యాండ్ లైన్ నుంచి ఎప్పుడో ఒకసారి అరుదైన ఫోన్ కాల్ ద్వారా పరిమిత సంభాషణలే ఉండేవి. కానీ నేటి కాలంలో పరిస్థితి మారిపోయింది.
By: Tupaki Political Desk | 21 Feb 2026 12:33 PM ISTఒకప్పుడు పెళ్లి కుదిరిందంటే ఇళ్లలో పెద్దల సందడి, ఓర చూపులు, పత్రికల ద్వారా లేదా ల్యాండ్ లైన్ నుంచి ఎప్పుడో ఒకసారి అరుదైన ఫోన్ కాల్ ద్వారా పరిమిత సంభాషణలే ఉండేవి. కానీ నేటి కాలంలో పరిస్థితి మారిపోయింది. నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచే కాబోయే వధూవరులు గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకోవడం సాధారణమైంది. పరిచయం పెరుగుతుందనే భావనతో ప్రారంభమయ్యే ఈ ముచ్చట్లు.. కొన్ని సందర్భాల్లో అపోహలు, అంచనాలు, వాదనలు పెరిగి పెళ్లి వరకు రాకముందే సంబంధాలు విరిగిపోవడానికి దారితీస్తున్నాయని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సేవ్ సమాజ్ ఆదర్శ నిర్ణయం..
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో సేన్ సమాజం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి జరిగేంత వరకు వధూవరులు ఫోన్లలో వ్యక్తి గతంగా మాట్లాడుకోవడాన్ని నిషేధిస్తూ సమాజం తీర్మానం చేసింది. ఫోన్లు కుటుంబ సంబంధాలను బలహీనపరుస్తున్నాయనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సేన్ కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కౌశిక్ తెలిపారు.
పెళ్లి అనేది కేవలం ఇద్దరి వ్యక్తుల సంబంధం మాత్రమే కాదు; రెండు కుటుంబాల అనుబంధం. కానీ వ్యక్తి గతంగా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు అధిక అంచనాలు పెట్టుకోవడం, చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం వల్ల అనవసర విభేదాలు తలెత్తుతున్నాయని పెద్దలు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మాటల్లో అపార్థాలు పెరిగి, భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోందని వారు అంటున్నారు.
కుటుంబ సమక్ష్యంలో మాట్లాడుకోవడం వరకు ఓకే..
అయితే పూర్తిగా సంభాషణల్ని నిలిపివేయడం కాదు. కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవడంపై ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అంటే సంబంధం పారదర్శకంగా, పెద్దల పర్యవేక్షణలో ఉండాలని కోరుతున్నారు. ఇది ఒక రకంగా సంప్రదాయ విలువలను కాపాడాలనే ప్రయత్నంగా భావించవచ్చు. ఈ నిర్ణయం కొందరికి పురాతన ఆలోచనగా అనిపించవచ్చు. మరి కొందరికి ఇది అవసరమైన నియంత్రణగా కనిపిస్తోంది. ఆధునిక కాలంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలనే ఆలోచన అంతే బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి అన్నది సమాజం ముందున్న ప్రశ్న.
మొత్తానికి సేన్ సమాజం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చర్చకు నాంది పలికింది. ప్రేమ, పరిచయం, అవగాహన అన్నీ అవసరమే. కానీ అవి కుటుంబ బంధాలను బలహీనపరచకుండా, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి. ‘మూడుముళ్లు పడేదాకా ఫోను ముచ్చట్లు బంద్’ అనే ఈ నిర్ణయం.. సంప్రదాయం మరియు ఆధునికత మధ్య సాగే పోరాటానికి ప్రతీకగా నిలిచింది.
యువతలో భిన్నాభిప్రాయాలు..
ఇక ఈ నిర్ణయంపై యువతలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని, పెళ్లి అనే జీవితకాల నిర్ణయం తీసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవడం అవసరమని వాదిస్తున్నారు. పరిచయం లేకుండా పెళ్లి జరిగితే తర్వాత పెద్ద సమస్యలు తలెత్తే అవకాశముందని కూడా సూచిస్తున్నారు. మరో వైపు పెద్దలు మాత్రం ‘అతిగా పరిచయం కూడా అపార్థాలకు దారితీస్తుంది’ అనే వాదనను ముందుకు తెస్తున్నారు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసి, కుటుంబాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాజ మార్పు అనేది ఎప్పుడూ చర్చల మధ్యే ముందుకు సాగుతుంది. ఈ నిర్ణయం సరైందేనా?, కాదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పెళ్లి వ్యవస్థలో సంభాషణల పాత్ర ఎంత ముఖ్యమో, అదే సమయంలో పరిమితుల ప్రాముఖ్యత కూడా అంతే కీలకం. సంప్రదాయం, ఆధునికత రెండూ సమతుల్యంగా కలిసే మార్గాన్ని వెతకాల్సిన అవసరం సమాజం ముందు నిలిచింది. మూడుముళ్లు పడే వరకు మౌనం పాటించాలనే ఈ నిర్ణయం.. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ చర్చకు దారి తీసే అవకాశముంది.
