Begin typing your search above and press return to search.

అదో వింత రూల్.. హైహీల్స్ వేసుకోవాలంటే అక్కడ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే ?

కొన్ని చోట్ల కొన్ని రూల్స్ చూస్తే మనం అవాక్కవడం ఖాయం. సరిగ్గా అలాంటి వింత నిబంధనే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న 'కమెల్ బై ది సీ' అనే చిన్న నగరంలో ఉంది.

By:  Tupaki Desk   |   24 May 2025 5:00 AM IST
No High Heels Allowed Without Permission in U.S. Town
X

కొన్ని చోట్ల కొన్ని రూల్స్ చూస్తే మనం అవాక్కవడం ఖాయం. సరిగ్గా అలాంటి వింత నిబంధనే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న 'కమెల్ బై ది సీ' అనే చిన్న నగరంలో ఉంది. ఏంటంటే, ఆ ఊళ్లో రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న హైహీల్స్ వేసుకోవడం అస్సలు కుదరదు. ఒకవేళ వేసుకోవాలంటే మాత్రం అక్కడి లోకల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది.

ఎందుకు ఈ వింత రూల్?

కాలిఫోర్నియాలోని కమెల్ బై ది సీ చాలా అందమైన నగరం. ఇక్కడ బీచ్‌లు, పాత కట్టడాలు, ప్రకృతి అందాలు టూరిస్టులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే, ఈ నగరంలో సైప్రస్, పైన్ చెట్లు చాలా ఎక్కువ. అవి చాలా పెద్దవిగా పెరగడంతో, వాటి వేర్లు రోడ్ల కిందకు, పేవ్‌మెంట్ల (పాదచారులు నడిచే మార్గాలు) కిందకు బాగా వ్యాపించాయి. ఈ వేర్ల పెరుగుదల వల్ల పేవ్‌మెంట్లు దెబ్బతింటున్నాయి. ఎన్నిసార్లు రిపేర్ చేసినా అవి మళ్లీ మళ్లీ పాడవుతున్నాయి.

దీంతో పేవ్‌మెంట్లు విరిగిపోయి, నడవడానికి చాలా కష్టంగా తయారయ్యాయి. అలాంటి చోట్ల హైహీల్స్ వేసుకొని నడిస్తే, కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే 1963లోనే అప్పటి సిటీ అటార్నీ హైహీల్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వాటిని ధరించాలని అనుకుంటే, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన పెట్టారు. అంతేకాదు, పర్మిషన్ తీసుకున్నా సరే, హైహీల్స్‌తో నడిచి పడిపోతే, దానికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదు. పడిపోయిన వాళ్ళు ప్రభుత్వాన్ని నిందించడానికి లేదా కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు.

టూరిస్టులకు ఇదొక జ్ఞాపకం!

ఈ అందమైన ఊరిని చూడటానికి వచ్చే చాలా మంది టూరిస్టులు, హైహీల్స్ ధరించకపోయినా సరే.. స్థానిక ప్రభుత్వ ఆఫీస్‌కి వెళ్లి ఆ పర్మిషన్ పత్రాన్ని తీసుకుంటారు. ప్రభుత్వం ముద్రించిన ఈ పర్మిషన్ లెటర్‌పై అప్లై చేసుకున్న వాళ్ళ పేరు, ఆఫీసర్ సంతకం ఉంటాయి. వీటిని టూరిస్టులు ఒక మధురమైన జ్ఞాపకంగా దాచుకుంటున్నారు. ఈ వింత రూల్ వల్ల ఈ ఊరికి మరింత ప్రత్యేకత వచ్చింది, టూరిస్టులు దీన్ని ఒక ఆసక్తికరమైన అనుభవంగా భావిస్తున్నారు. నిజంగా వింతైన రూలే కదా?