Begin typing your search above and press return to search.

నామినేషన్ కే రూ. కోట్లు.. కానీ ఓటమి.. ఆ డివిజన్ వింత పరిస్థితి..

నిజామాబాద్‌లో జరిగింది ఇదేనా? డబ్బు ఖర్చు పెరిగేకొద్దీ ప్రజల మద్దతు తగ్గిందా? స్థానిక సమస్యలు, గ్రౌండ్‌ కనెక్ట్‌, అభ్యర్థి వ్యక్తిత్వం వంటి అంశాల కంటే డబ్బుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వ్యూహపరమైన పొరపాటా?

By:  Tupaki Political Desk   |   14 Feb 2026 10:25 AM IST
నామినేషన్ కే రూ. కోట్లు.. కానీ ఓటమి.. ఆ డివిజన్ వింత పరిస్థితి..
X

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పండగ లాంటివి. కానీ ఆ పండుగలో డబ్బు ప్రవాహంగా మారితే? నిజామాబాద్‌ మున్సిపల్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామం ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించబడిన కాటిపల్లి శమంత భారీగా ఖర్చు పెట్టినప్పటికీ, 19వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

డబ్బు ప్రవాహం..

ప్రచారంలో డబ్బు ప్రవాహం కొత్తేమీ కాదు. కానీ ‘నామినేషన్‌ కోసమే రూ.8 కోట్లు’ ఖర్చయిందనే ఆరోపణలు, ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకూ పంపిణీ జరిగిందనే ప్రచారం, ఇతర డివిజన్లకూ నిధులు సర్దడంతో మొత్తం ఖర్చు రూ.20 కోట్లకు చేరిందనే అంచనాలు.. ఇవన్నీ ప్రజాస్వామ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల వ్యయ పరిమితులు కాగితాలపైనే మిగిలిపోతున్నాయా?

దెబ్బతిన్న వ్యూహం..

మేయర్‌ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించడం వ్యూహాత్మకంగా గెలుపు బాట వేస్తుందని భావించవచ్చు. కానీ అదే నిర్ణయం ప్రత్యర్థి శిబిరాన్ని అప్రమత్తం చేస్తుంది. ఒక అభ్యర్థి గెలుపు ఖాయం అన్న భావన ఏర్పడితే, ప్రజల్లో ప్రతిస్పందన కూడా ప్రతికూలంగా మారే అవకాశముంది. ‘డబ్బు ఉంది కాబట్టి గెలుస్తారు’ అన్న అహంభావం కనిపిస్తే, ఓటర్లు మౌనంగా తీర్పు చెప్పడం కొత్తేమీ కాదు.

డబ్బు ఖర్చు వర్సెస్ ఓటర్ల మద్దతు..

నిజామాబాద్‌లో జరిగింది ఇదేనా? డబ్బు ఖర్చు పెరిగేకొద్దీ ప్రజల మద్దతు తగ్గిందా? స్థానిక సమస్యలు, గ్రౌండ్‌ కనెక్ట్‌, అభ్యర్థి వ్యక్తిత్వం వంటి అంశాల కంటే డబ్బుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వ్యూహపరమైన పొరపాటా? ఇవన్నీ విశ్లేషణకు వస్తున్న ప్రశ్నలు. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఒక్కో ఓటుకు వేల రూపాయలు ఖర్చయిందనే ఆరోపణలు నిజమైతే, అది కేవలం ఒక పార్టీ సమస్య కాదు.. అది వ్యవస్థ సమస్య. డబ్బు పంచడం ద్వారా ఓటు కొనుగోలు చేయాలన్న ప్రయత్నం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఓటు విలువను రూపాయలతో కొలవడం మొదలైతే, ఆ వ్యవస్థలో నైతికతకు స్థానం తగ్గిపోతుంది.

భిన్నంగా ఓటర్ల తీర్పు..

అయితే ఓటర్లు ఇచ్చిన తీర్పు మాత్రం మరో సందేశం ఇస్తుంది. భారీ ఖర్చు, ముందస్తు ప్రకటనలు, ప్రచార వైభవం.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఓటమి పాలవడం అంటే ప్రజలు డబ్బుతో ప్రభావితమవ్వడం తప్పనిసరి కాదని స్పష్టం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ఆశాజనకమైన సంకేతం కావచ్చు.

పార్టీలకు హెచ్చిరక..

ఇంకో వైపు, ఈ పరిణామం పార్టీలకు ఒక హెచ్చరిక. ఎన్నికలు కేవలం ఆర్థిక పోటీ కాదు. స్థానిక స్థాయిలో ప్రజలతో బంధం, విశ్వాసం, సమస్యలపై పట్టుదల.. ఇవే అసలైన మూలధనం. డబ్బు ప్రచారాన్ని పెంచవచ్చు.. కానీ విశ్వాసాన్ని కొనలేం. ఓటర్ల మౌన నిర్ణయం దానికి సాక్ష్యం.

ఈ ఘటన మరొక చర్చను కూడా తెరపైకి తీసుకొస్తోంది. ఎన్నికల ఖర్చుల పారదర్శకత. అధికారిక లెక్కలు, అనధికారిక అంచనాలు మధ్య ఉన్న అంతరం ఎంత? ఖర్చు పరిమితుల అమలు ఎంత కఠినంగా జరుగుతోంది..? ఎన్నికల సంఘం పర్యవేక్షణ మరింత బలపడాలా? ఇవి సమాధానం కావాల్సిన ప్రశ్నలు. చివరగా, నిజామాబాద్‌ ఫలితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది.. ప్రజాస్వామ్యంలో చివరి మాట ఓటరుదే. డబ్బు, దూకుడు, వ్యూహాలు ఇవన్నీ ఓటు వేసే క్షణంలో మాయమవుతాయి. విశ్వాసం గెలిస్తేనే విజయం. లేకపోతే కోట్ల ఖర్చయినా ఫలితం శూన్యమే.