Begin typing your search above and press return to search.

నిజామాబాద్‌లో దంపతుల ఖతర్నాక్ దందా.. చిక్కితే విలవిల

తాజాగా నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఒక హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కేవలం డబ్బు కోసం కట్టుకున్న భార్యనే ఎరగా వేసి, అమాయకులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న భర్త బండారం బయటపడింది.

By:  Tupaki Political Desk   |   11 May 2026 11:00 PM IST
నిజామాబాద్‌లో దంపతుల ఖతర్నాక్ దందా.. చిక్కితే విలవిల
X

సమాజంలో నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు, కామ కోరికలను పెట్టుబడిగా మలచుకుని మరికొందరు అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఒక హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కేవలం డబ్బు కోసం కట్టుకున్న భార్యనే ఎరగా వేసి, అమాయకులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న భర్త బండారం బయటపడింది. దాదాపు 15 రోజులుగా చెలరేగిపోయిన ఖతర్నాక్ దంపతులను పోలీసులు చాకచక్కంగా పట్టుకున్నారు.

చూపులతో ఆకర్షించి..

పోలీసుల స్టింగ్ ఆపరేషన్ లో ఓ మహిళ హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. వరుస ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి వలపు వల విసురుతున్న సదరు మహిళను ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగర శివారుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో ఒక మహిళ ఒంటరిగా తిరుగుతూ సింగిల్ గా వచ్చే వారిని ఆకర్షిస్తోంది. అటుగా వెళ్లే వారిని తన చూపులతో ఆకర్షించడమే కాకుండా, మంచి మాటలతో మగ్గులోకి దింపేదని చెబుతున్నారు. ఇద్దరి మధ్య డీల్ కుదిరిన తర్వాత పక్కన పొలాలు, పొదల మధ్యలోకి వెళ్లేవారని పోలీసులు చెప్పేవారు.

అక్కడే అసలు కథ మొదలు

మహిళతో బేరం మాట్లాడుకుని వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ఆమెతో ఆ వ్యక్తి ఏకాంతంగా గడిపేందుకు సిద్ధమైన మరుక్షణమే పక్కనే మాటు వేసిన భర్త రంగ ప్రవేశం చేసి ఇద్దరినీ నిలదీసినట్లు కేకలు వేస్తాడని, ‘నా భార్యతో ఏం చేస్తున్నావు?’ అంటూ గొడవకు దిగుతాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఆ మహిళ కూడా ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి, సదరు వ్యక్తి తనపై అత్యాచార ప్రయత్నం చేశాడంటూ కేకలు వేస్తూ భయపెడుతుందని పోలీసులు గుర్తించారు.

కేసు పేరుతో బెదిరింపులు

ఈ క్రమంలో ఆ వ్యక్తి భయపడగానే, దంపతులిద్దరూ కలిసి అతడిని బెదిరించడం మొదలుపెడతారని పోలీసులు తెలిపారు. ‘నిన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తాం.. రేప్ కేసు పెట్టి పరువు తీస్తాం" అంటూ బ్లాక్‌మెయిల్ చేయడంతోపాటు భారీగా డబ్బు గుంజుకుంటున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెడితే సమాజంలో పరువు పోతుందన్న భయంతో బాధితులు అడిగినంత నగదు ఇచ్చి గుట్టుగా జారుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే కొందరు బాధితులు తమకు పరిచయం ఉన్నవారి ద్వారా పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టినట్లు చెబుతున్నారు.

పక్కాప్లాన్ తో గుట్టురట్టు

గత 15 రోజులుగా ఈ తరహా ఫిర్యాదులు పోలీసులకు అందుతుండటంతో, నిజామాబాద్ పోలీసులు రహస్య నిఘా పెట్టారు. పక్కా ప్లాన్‌తో ఈ జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే లేదా ఎదురు తిరిగితే ఆ కత్తితో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి మాయగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత మహిళల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.