బ్రిటన్ రాణి పెళ్లికి నిజాం నవాబు నెక్లెస్ గిఫ్టు.. ఇప్పుడు విలువ ఎంతంటే?
ఇప్పుడు కాదు కానీ దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి భారత దేశంలో తొలి బిలియనీర్ ఎవరంటే.. ఇంకెవరు హైదరాబాద్ నవాబు పేరు చెప్పేవారు.
By: Tupaki Desk | 7 May 2025 11:00 AM ISTఇప్పుడు కాదు కానీ దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి భారత దేశంలో తొలి బిలియనీర్ ఎవరంటే.. ఇంకెవరు హైదరాబాద్ నవాబు పేరు చెప్పేవారు. అంతటి సంపద ఆయన సొంతం. హైదరాబాద్ 7 వ నిజాం నవాబు బ్రిటన్ రాణి పెళ్లికి ఇచ్చిన బహుమతి.. దాని తాజా విలువ ఎంత? అదిప్పుడు ఎక్కడ? ఎవరి దగ్గర ఉంది? లాంటి ఆసక్తికర అంశాల్ని చూస్తే.. ప్రజల మీద పన్నులు వేసే రాజులు.. ఆ సంపదను తాము ఎంతలా పోగు వేసుకునే వారో అర్థమవుతుంది.
హైదరాబాద్ సంస్థాన పాలకుడు 7వ నిజాం (ఆయనే చివరి రాజు కూడా) మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్తి విలువ అప్పట్లోనే రూ.1700 కోట్లు. ఇప్పుడైతే అదెంత? అన్నది అంచనా వేయాలన్నా కష్టమే. అంతటి సంపద పోగేసుకున్న సదరు రాజు.. బ్రిటన్ రాణికి మాత్రం అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించేవారు. 1947లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా అత్యంత ఖరీదైన వజ్రాల నక్లెస్ ను గిఫ్టుగా ఇచ్చారు. ఖరీదైన బహుమతిని ఇచ్చినప్పటికీ.. అప్పట్లో ఆయన రాణి పెళ్లికి మాత్రం హాజరు కాలేదు. నిజానికి ఆయనకు వివాహానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది.
అయితే.. పెళ్లికి వెళ్లకున్నా.. బ్రిటన్ పైనా.. రాణిపైనా తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు రాణికి అరుదైన బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తనకు నచ్చిన డిజైన్ ఎంచుకునేలా ఏర్పాట్లు చేయటమే కాదు.. రాణి సూచనలకు తగ్గట్లుగా హారాన్ని డిజైన్ చేయించినట్లు చెబుతారు. మొత్తం 300 వజ్రాలను ప్లాటినం హారంలో పొదిగి.. దీన్ని డిజైన్ చేశారు. ఇంగ్లిష్ సంప్రదాయక రోజ్ డిజైన్ స్ఫూర్తిగా ఈ హారాన్ని డిజైన్ చేయించినట్లుగా చెబుతారు. మెడలో హారంగా దీన్ని ధరించేలా దీన్ని రూపొందించారు. అయితే.. తర్వాతి రోజుల్లో కొన్ని వజ్రాల్ని తొలగించి.. డిజైన్ మార్చినట్లుగా చెబుతారు.
బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించక ముందు అధికారిక ఫోటో దిగేందుకు నిజాం రాజు బహుమతిగా ఇచ్చిన నెక్లెస్ ను ధరించారంటూ చరిత్రకారులు చెబుతారు. ఇదే నక్లెస్ ను 2014లో కేట్ మిడిల్ టన్ ధరించారని.. దీన్ని నేషనల్ పొట్రెయిట్ గ్యాలరీ కోసం జరిపిన ఫోటో షూట్ కోసం ధరించినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ నగ ఖరీదు రూ.694 కోట్లుగా అంచనా వేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగగా దీనికి పేరుంది. అంతేకాదు.. బ్రిటన్ రాజ వంశానికి ఉన్న అత్యంత విలువైన నగల్లో ఇదొకటన్న పేరుంది. 2022లో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన అధికారిక ఇన్ స్టా అకౌంట్ లోనూ ఈ నగను ప్రదర్శించటం గమనార్హం.
