Begin typing your search above and press return to search.

"రాహుల్ ట‌క్క‌రి నా క్రెడిట్‌ను కొట్టేయాల‌ని చూశారు"

అని తాజా గా మిత్రుల‌ను మార్చి.. మ‌రోసారి అధికారం ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:30 AM GMT
రాహుల్ ట‌క్క‌రి నా క్రెడిట్‌ను కొట్టేయాల‌ని చూశారు
X

"రాహుల్ గాంధీ.. నా ప్లాన్‌ను కొట్టేసి.. నా క్రెడిట్ ను కొట్టేసి తాను ల‌బ్ధిపొందాల‌ని అనుకున్నారు. అది నాకు న‌చ్చ‌లేదు. నా స్టేట్‌లోనే నాకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డితే.. నేనెలా త‌ట్టుకుంటా!" అని తాజా గా మిత్రుల‌ను మార్చి.. మ‌రోసారి అధికారం ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మితో తెగ తెంపులు చేసుకున్న ఆయ‌న‌.. తిరిగి గ‌త మిత్ర పార్టీ బీజేపీతో చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అస‌లు ఇండియా కూట‌మిని ఎందుకు వ‌దులుకున్నారు..? సుఖంగా సాగుతున్న పాల‌న‌ను ఎందుకు వ‌దిలేశారు? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగింది. దీనికి చెక్ పెడుతూ.. తాజాగా నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. త‌ను ఇండియా కూట‌మి నుంచి బ‌య‌టకు రావ‌డానికి కార‌ణాలు.. రాహుల్ వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

"విపక్ష కూటమికి 'ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్‌'(ఇండియా) అనే పేరు వద్దని చెప్పా. ప‌దే ప‌దే మొత్తుకున్నా.. అయినా.. కూడా కాంగ్రెస్‌, ఇతర విపక్ష కూటమి నేతలు నా మాట వినిపించుకోలేదు. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చా. ఇది త‌ప్పుకాదు. ఎవ‌రు మాత్రం మాట విన‌ని చోట ఉంటా రు. పోనీ.. క‌నీసం లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ అంశాన్న‌యినా.. పూర్తి చేయ‌మ‌ని అడిగా. అది కూడా తేల్చ‌లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కపెడుతుండడం నాకు న‌చ్చ‌లేదు. విపక్ష కూటమిని మరో పేరు ఎంచుకోవాలని కోరాను, కానీ అప్పటికీ వారు ఆ పేరు ఖరారు చేశారు. నేను ఎంత ప్రయత్నించినా పెడచెవిని పెట్టారు. ఈరోజుకు కూడా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే నిర్ణయానికి రాలేదు. ఈ కారణం వల్లే నేను వెనక్కి వచ్చాను. ఇంతకుముందు ఎవరితో పనిచేశానో వారితోనే కలిసాను. బీహార్ ప్రజల కోసం నేను పనిచేస్తూనే ఉంటాను" అని నితీష్ అన్నారు. అందుకే తాను ఇండియాను వ‌దిలేశాన‌న్నారు.

రాహుల ట‌క్క‌రి!

బిహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ టక్క‌రి అని అన్నారు. రాష్ట్రంలో కుల గ‌ణ‌న‌ను తాను చేప‌డితే.. రాహుల్ గాంధీ ఆ క్రెడిట్ కొట్టేయాల‌ని చూశార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కులగణన ఎప్పుడు జరిగిందో రాహుల్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 2019-2020లో కులగణన అంశంపై అసెంబ్లీ నుంచి బహిరంగ సభల వరకూ ప్రతిచోట మాట్లాడానన్నారు. తాను ఇంత క‌ష్ట‌ప‌డి చేసిన కుల గ‌ణ‌న క్రెడిట్‌ను రాహుల్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూశార‌ని నితీష్ త‌ప్పుబ‌ట్టారు.