Begin typing your search above and press return to search.

బీహారీ బాబు నితీష్ కుమార్ కి ఏమైంది...!?

నితీష్ కుమార్ అంటేనే నిజాయితీకి మారు పేరు. చిత్తశుద్ధికి బ్రాండ్ అంబాసిడర్. నిట్ట నిలువు వ్యక్తిత్వానికి పెట్టింది పేరు

By:  Tupaki Desk   |   9 April 2024 3:54 AM GMT
బీహారీ బాబు నితీష్ కుమార్ కి ఏమైంది...!?
X

నితీష్ కుమార్ అంటేనే నిజాయితీకి మారు పేరు. చిత్తశుద్ధికి బ్రాండ్ అంబాసిడర్. నిట్ట నిలువు వ్యక్తిత్వానికి పెట్టింది పేరు. రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు ఉండవచ్చు. కానీ అవినీతికి వ్యతిరేకంగా ఉంటూ తన సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో నితీష్ ఎపుడూ తగ్గలేదు. ఆయన పార్టీలు అటూ ఇటూ మారవచ్చు. కానీ ఎక్కడా తనను తాను తగ్గించుకోలేదు.

కానీ ఇటీవల కాలంలో ఆయన పోకడలు చూసిన వారు ఏమిటి ఈ బీహారీ బాబు తీరు అని ముక్కున వేలేసుకుంటున్నారు. సోషలిస్ట్ లీడర్ రాం మనోహర్ లోహియా శిష్యుడేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ అడుగు జాడలలో నడచిన నేతగా నితీష్ కి పేరుంది. అలాంటి నాయకుడు ఎందుకు ఇలా అన్న వారూ ఉన్నారు.

తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాదాలకు నితీష్ వంగి నమస్కారం చేయడం ఆయన అభిమానులే కాదు రాజకీయ ప్రత్యర్ధులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద లాలూ కుమారుడు ఆర్జేడీ నేత అయిన తేజస్వి యాదవ్ అయితే నితీష్ ని అలా చూడలేకపోయాను అని అంటున్నారు.

నరేంద్ర మోడీ కంటే నితీష్ సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన జాతీయ రాజకీయాల్లో చాలా కాలం క్రితమే ప్రవేశించారు. ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. బీహార్ లో సుదీర్ఘ కాలం సీఎం గా ఉంటున్నారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ కి నచ్చిన నాయకుడు. నిబద్ధత కలిగిన నాయకుడు ఇలా మోడీకి ఎందుకు పాదాభివందనం చేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

సరే ఆయన ఇష్టం ఎన్డీఏలో చేరి ఉండవచ్చు. ఎన్డీఏ మిత్ర పక్షాల నేతలు ఎవరూ కూడా ఆయన మాదిరిగా పాదాభివందనాలు చేసిన సందర్భాలు లేవు అని గుర్తు చేస్తున్నారు. ఏపీలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చిలకలూరిపేటలో జరిగిన సభలో మోడీని పొగిడారు. అతి శృతి మించింది అని విమర్శలు వచ్చాయి.

ఇపుడు నితీష్ ని చూస్తే చంద్రబాబు చాలా బెటర్ అని అంటున్న వారూ ఉన్నారు. మోడీ కనుసన్నలలో పడాలని ఎందుకు ఆరాటం అన్నదే ఇక్కడ ప్రశ్న. అంతే కాదు నితీష్ పదే పదే మరో మాట అంటున్నారు. తాను జీవితాంతం ఎన్డీయేలో ఉంటాను అని. గతంలోనూ చెప్పారు. ఇపుడూ చెబుతున్నారు. ఎందుకు ఇంతలా సంజాయిషీ ఇవ్వాల్సి వస్తోందో ఆయనే చెప్పాలి.

అయినా ఏ పార్టీతో అయినా పొత్తులు ఎత్తులు అన్నవి రాజకీయాల్లో కామన్. ఎందుకు పొత్తు పెట్టుకుంటారో విడిపోతారో ప్రజలకు తెలుసు. అన్నీ రాజకీయ కొలమానాల మీదనే ఆధారపడి ఉంటాయి. బీజేపీ వైపు నుంచి ఇబ్బందులు వచ్చినా ఎన్డీఏని వీడిపోకుండా నితీష్ ఉండగలరా అంటే ఏమి జవాబు చెబుతారు. బంధం అన్నా పొత్తు అన్నా రెండు వైపులా బాగా ఉండాలి. కానీ కుదరకపోతే ఎవరైనా విడిపోతారు.

ఆ మాత్రం దానికి ఒట్లు పెట్టి మోడీ కళ్ళలో ఆనందం చూడాలనుకోవడం సీనియర్ మోస్ట్ నేత నితీష్ కి తగునా అని అంటున్నారు. ఇక బీహార్ సభలో ప్రధాని ఉండగానే నితీష్ మాట్లాడుతూ తన ప్రసంగంలో తడబాట్లు పొరపాట్లూ దొర్లించారు. అందులో ముఖ్యమైనది ఈసారి ఎన్డీయేకు నాలుగు వేల సీట్లు రావాలని.

మరి ఆయన ఈ మాటలు అనడంతో అంతా ముఖాముఖాలు చూసుకున్నారు. అసలే నాలుగు వందల ఎంపీలు ఎన్డీయేకు అంటేనే రాజకీయ తమాషాగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇపుడు నితీష్ దాన్ని మరింతగా పెంచి నాలుగు వేల సీట్ల నంబర్ చెప్పి పొలిటికల్ కామెడీ చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నితీష్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా అన్నదే చర్చకు వస్తున్న విషయం. వచ్చే ఏడాది బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి.

ఈ లోగా కేంద్రంలో మోడీ మూడవసారి ప్రధాని సీట్లో కూర్చోగానే బీహార్ లో రాజకీయ చక్రం తిప్పుతారని ఫలితంగా నితీష్ సీఎం సీట్లోకి బీజేపీ నేత వచ్చినా రావచ్చు అని అంటున్నారు. ఈ ప్రచారం ముమ్మరం కావడంతోనే మోడీకి పూర్తి విధేయుడిగా మారి నితీష్ ఆయనకు ఆఖరుకు పాదాభివందనం చేయడానికి వెనకాడటం లేదు అని కామెంట్స్ విపక్షాలు చేస్తున్నాయి.