Begin typing your search above and press return to search.

నితీష్ కి అన్ని చాన్సులు ...చంద్రబాబు ఏం పాపం చేశారు...!?

బీహార్ సీఎం నితీష్ కుమార్ కి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:29 AM GMT
నితీష్  కి అన్ని  చాన్సులు  ...చంద్రబాబు ఏం పాపం చేశారు...!?
X

బీహార్ సీఎం నితీష్ కుమార్ కి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఈ ఇద్దరూ రాజకీయ గాలిని ముందే పసిగట్టి దానికి అనుగుణంగా వేగంగా పావులు కదపగలరు. ఈ ఇద్దరూ పొత్తులను ఎంత తొందరగా కుదుర్చుకుంటారో అంతే వేగంగా వాటిని విడిచి పక్కన పెట్టగలరు అని అంటారు. ఈ ఇద్దరిదీ దాదాపుగా ఒకే ఏజ్. ఇంచుమించుగా ఒకెసారి రాజకీయాల్లోకి వచ్చారు.

ఈ ఇద్దరూ రాజకీయాల్లో సీటు కోసం ఎన్నో ఫీట్లు చేశారు. సమతా పార్టీ అంటూ జార్జి ఫెర్నాండెజ్ తో కలసి పెట్టిన నితీష్ కుమార్ ఆ తర్వాత దాన్ని జనతాదళ్ యూలో మిక్స్ చేశారు. దానికి నాయకత్వం వహిస్తున్న శరద్ యాదవ్ అనే సీనియర్ నేతను పక్కన పెట్టి ఆ పార్టీని తానే సొంతం చేసుకున్నారు

ఇక ఏపీలో టీడీపీ ఎవరితో తెలిసిందే. తన సొంత మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని తన హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ పార్టీని తానే సర్వాధికారిగా ఉన్నారు. నితీష్ బీహార్ రాజకీయ కార్యక్షేత్రంగా అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన లాలూతో ఉంటూనే కాంగ్రెస్ కి కన్ను గీటగలరు, అలాగే బీజేపీతో కాపురం చేయగలరు. ఈ రికార్డులు ఆయనకే సొంతం.

అదే విధంగా ఏపీలో చూస్తే చంద్రబాబు కూడా దాదాపుగా అన్ని పార్టీలతోనూ పొత్తులు కలిపారు. ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అన్నది ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఉంటోంది. ఆయన ఆఖరుకు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేలా చేశారు

చంద్రబాబు జీవితంలో బీజేపీతో ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నారు 1998 దాకా గుడులు కూల్చేసిన బీజేపీ అంటూ ఆ తరువాత అదే పార్టీతో జత కలిసారు. 2004 వరకూ సాగిన ఆ సావాసం ఉమ్మడి ఏపీలో టీడీపీ కేంద్రంలో వాజ్ పేయ్ ఓడిపోగానే కట్ అయిపోయింది. ఇక జన్మలో బీజేపీతో పొత్తు ఉండదని భీకర ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు 2014లో మాత్రం తిరిగి బీజేపీతోనే పొత్తు కలిపారు.

అది కాస్తా 2018 దాకా సాగింది. 2018లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బీజేపీకి కటీఫ్ అనేశారు. ఇపుడు మళ్లీ బీజేపీతో పొత్తుకు రెడీ అన్నట్లుగా టీడీపీ ఉంది. ఇవన్నీ రాజకీయాల్లో మామూలే అనుకున్నా నితీష్ కుమార్ కి ఎన్నో చాన్సులు ఇస్తున్న బీజేపీ ఏపీలో చంద్రబాబుని మాత్రం ఎందుకు కరుణించడం లేదు అన్నది ప్రశ్నగా ఉంది.

చంద్రబాబు ఏమి పాపం చేశారు అన్న సందేహాలు వస్తున్నాయి. నితీష్ కుమార్ బీజేపీతో జట్టు కట్టి విడాకులు ఇస్తూ ఇలా ఎన్నో విన్యాసాలు చేసినా ఆయన్ని అక్కున చేర్చుకుని సీఎం గా ఆయనే ముందుంచుతున్న బీజేపీ ఏపీలో మాత్రం తమకు ఏ మాత్రం బలం లేని చోట చంద్రబాబుతో రాజకీయ రాయబేరాలు ఆడుతూ ముంచకుండా తేల్చకుండా చేయడంలోని మతలబు ఏమిటి అన్నది అంతా చర్చించుకుంటున్నారు.

అయితే నితీష్ కి చంద్రబాబుకు ఒక తేడా ఉందని ఇక్కడ అంటున్నారు. నితీష్ బీజేపీతో విడిపోయినా ఆ పార్టీని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. అదే విధంగా ఆయన కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పని చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం బీజేపీ పెద్దలనే టార్గెట్ చేసి ఆగ్రహానికి గురి అయ్యారని అందుకే ఇలా అని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి నితీష్ తో చెలిమి చేసిన బీజేపీ రేపు చంద్రబాబుకూ స్నేహ హస్తం అందించవచ్చు అని అంటున్నారు.