బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు...నితీష్ సంగతేంటి ?
బీహార్ బీజేపీని ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల అన్నింటిలో పాగా వేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన బీజేపీకి బీహార్ మాత్రం చిక్కడం లేదు దక్కడం లేదు.
By: Satya P | 5 March 2026 1:00 AM ISTబీహార్ బీజేపీని ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల అన్నింటిలో పాగా వేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన బీజేపీకి బీహార్ మాత్రం చిక్కడం లేదు దక్కడం లేదు. నిజం చెప్పాలీ అంటే బీహార్ లో కుల సమీకరణలు ఎక్కువ. మత రాజకీయాలు నడవవు. అందువల్లనే ఈ రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా పట్టు సాధించడానికి మొదటి నుంచి అతి పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. మొత్తానికి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నితీష్ కుమార్ తో జట్టు కట్టి బీజేపీ ఆ రాష్ట్రంలో బాగానే రాణిస్తోంది. అయితే అధికారంలో భాగస్వామ్యం ఉన్నా ఉప ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చినా సీఎం పదవి మాత్రం ఇంకా అందని పండుగానే ఉంది.
ఎక్కువ సీట్లు దక్కినా :
ఇదిలా ఉంటే 2025 చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. చెరి వంద సీట్లకు బీజేపీ జేడీయూ పోటీ చేశాయి. మిగిలిన సీట్లు మిత్రులకు పంచాయి. ఈ వందలో బీజేపీ 89 సీట్లను సాధించింది. అంటే కేవలం 11 సీట్లను మాత్రమే కోల్పోయి బంపర్ విక్టరీ కొట్టింది అన్న మాట. జేడీయూ కూడా ఏమీ తీసిపోలేదు, 85 సీట్లు సాధించి బీజేపీ పక్కనే ఉంది. అయితే నితీష్ చరిష్మాను విపక్షాల విమర్శల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయననే సీఎం గా చేసింది.
ఆలస్యం చేయకుండా :
అధికారంలోకి ఎన్డీయే కూటమి వచ్చింది. బీజేపీ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు అందుకుంది. ఇదనతా జరిగి నాలుగు నెలలే అయింది. ఇంకా ఈ కూటమి చేతిలో 56 నెలల అధికారం ఉంది. కానీ ఎందుకో బీజేపీ మాత్రం తొందర పడుతోంది. ఆలస్యం అయితే వ్యవహారం వేరేగా మారుతుంది అన్న ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు కానీ బీజేపీ బీహార్ పీఠం పై తమ నేతను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని అనుకుంటోంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే సరైన సమయం అని కూడా భావిస్తోంది అని చెబుతున్నారు.
బీజేపీ ముఖ్యమంత్రి :
యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి వచ్చి మూడున్నర దశాబ్దాలు అయింది. ఇప్పటికి తొమ్మిదేళ్ళుగా యోగీ ఆదిత్య నాథ్ కూడా అప్రతిహతంగా కొనసాగుతున్నారు. అదే పక్కనే ఉన్న బీహార్ లో మాత్రం కాషాయ పార్టీకి ఆ యోగం దక్కడం లేదు, అందుకే ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండాలని అనుకునే ఎన్నికల బరిలోకి దిగింది. అయితే నితీష్ కి సీఎం అని జేడీయూ నేతల నుంచి డిమాండ్ వచ్చింది. అంతే కాదు విపక్షాలు సైతం బీజేపీ నితీష్ ని పక్కన పెడుతోంది అని విమర్శించాయి. అందుకే కొన్నాళ్ళ పాటు అని ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించారు. కానీ బొత్తిగా ఏడాది అయినా కాకుండా నితీష్ ని పక్కన పెట్టి తమ పార్టీ నేతకు పగ్గాలు ఇవ్వడానికి చూస్తున్నారు అన్న వార్తలే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
నితీష్ కి కేంద్రంలో :
మరి ప్రస్తుతం సీఎం గా ఉంటూ జనాలలో ఎంతో ఆదరణ కలిగిన నితీష్ కుమార్ ని ఏమి చేస్తారు అంటే ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. నిజానికి ఉప రాష్ట్రపతి పదవికి నితీష్ కి ఇస్తారని గత ఏడాది ప్రచారం సాగింది. కానీ ఇపుడు కేంద్రంలో మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు తొలి విడత జరుగుతున్నాయి. దాంతో బీహార్ లో మొత్తం సీట్లు ఎన్డీయే కూటమికే దక్కుతాయని అంటున్నారు. అందులో ఒక సీటు నుంచి నితీష్ కుమార్ పోటీ చేస్తారని అలా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అవుతారని ఆ వెంటనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పిస్తారు అని అంటున్నారు.
నితీష్ వారసుడికి పోస్టు :
మరో వైపు చూస్తే నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా నిశాంత్ కుమార్ రాజకీయ ప్రవేశం చేస్తారు అని అంటున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారంలో ఉంది. అయితే ఇపుడు నితీష్ కంద్ర రాజకీయాల్లోకి వెళ్తే నిషాంత్ కి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రి పదవి జేడీయూ కోటాలో ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా జేడీయూ బీజేపీ ల మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం చాలా స్మూత్ గా ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
