Begin typing your search above and press return to search.

23 ఏళ్ల తర్వాత కీలక పదవి.. ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్?

ఉప ప్రధాని.. భారత దేశంలో ఎందరో కీలక నాయకులు అలంకరించిన పదవి.. చివరగా 2002లో బీజేపీ అగ్ర నేత లాల్ క్రిష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు

By:  Tupaki Desk   |   10 April 2025 6:30 PM
23 ఏళ్ల తర్వాత కీలక పదవి.. ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్?
X

ఉప ప్రధాని.. భారత దేశంలో ఎందరో కీలక నాయకులు అలంకరించిన పదవి.. చివరగా 2002లో బీజేపీ అగ్ర నేత లాల్ క్రిష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. ఒకవేళ 2004 ఎన్నికల్లో గనుక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ గెలిచి ఉంటే అద్వానీ ప్రధాన మంత్రి అయ్యేవారమో..? కానీ, పరిస్థితులు మారిపోవడమే కాదు.. అద్వాణీ పూర్తిగా తెరమరుగయ్యారు.

2004-14 మధ్య పదేళ్లు ఏకధాటిగా మన్మోహన్ సింగ్, 2014 నుంచి 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ వ్యవధిలో ఎప్పుడూ ఉప ప్రధాని అనే పదవి ప్రస్తావనకు రాలేదు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ ను తప్పించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని భావించారు కానీ ఉప ప్రధాని అనే మాట వినిపించలేదు. ఇక మోదీ సంగతి తెలిసిందే. ఆయన పెద్ద అధికార కేంద్రం. మరో నాయకుడిని తన డిప్యూటీగా అంగీకరించరు.

చివరిసారిగా బీజేపీ హయాంలోనే ఆగిపోయిన ఉప ప్రధాని పదవి ప్రస్తావన మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది. అది కూడా బిహార్ సీఎం నీతీశ్ కు మార్ ఆ పదవి చేపట్టాలని అనే వ్యాఖ్యలు వస్తున్నాయి.

బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అయిన అశ్విని చౌబే మాట్లాడుతూ.. నీతీశ్ ను తాను ఉప ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమికి నీతీశ్ ఎంతో సేవ చేశారని.. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఆయనను ఉప ప్రధానిని చేయాలని చౌబే అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ఇదని కూడా వివరణ ఇచ్చారు. కాగా, బిహార్ నుంచి గతంలో బాబూ జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా పనిచేశారు.

నీతీశ్ కు ముందరి కాళ్ల బందం..

వాస్తవానికి 2005 నుంచి కొద్ది కాలం మినహా బిహార్ లో నీతీశ్ పాలనే నడుస్తోంది. అయితే, ఆయన కూటములు మార్చే నాయకుడనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గత ఐదేళ్లలో యూపీఏ (ఇండియా) నుంచి ఎన్డీఏకు, ఇండియా నుంచి యూపీఏకు సులువుగా మారారు. ఈ ఏడాది చివర్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నీతీశ్ బరిలో ఉండడం ఖాయం అయినా.. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కుమారుడిని రంగంలోకి దింపుతారని అంటున్నారు. మరోవైపు నీతీశ్.. ఇండియా కూటమి వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం లేదా ఇండియా వైపు వెళ్లకుండా చూసేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోందని చెబుతున్నారు.