Begin typing your search above and press return to search.

ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చింది అందుకే అంటున్న కేంద్రమంత్రి!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 March 2024 9:15 AM GMT
ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చింది అందుకే అంటున్న కేంద్రమంత్రి!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పైగా.. ఈ పథకం వల్ల క్విడ్ ప్రోకో రూపం మార్చుకుందని, ఫలితంగా అధికారపార్టీ ఖజానా నిండిందని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇందులో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్లు తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇందులో భాగంగా... మంచి ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇదే క్రమంలో.. విరాళాలు లేకుండా ఒక రాజకీయ పార్టీని నడపడం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టారు! గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం గురించిన చర్చలు జరిగాయని, నాడు జరిగిన ఆ చర్చల్లో తానుకూడా ఉన్నట్లు తెలిపిన గడ్కరీ... ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదని తెలిపారు. అసలు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఆయా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్తుస్తాయని.. ఐతే... మన దేశంలో అలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి స్కీం తీస్సుకొచ్చినట్లు వెల్లడించారు.

అసలు ఈ స్కీం తీసుకొచ్చిన ప్రధాన ఉద్దేశ్యమే.. పార్టీలకు నేరుగా నిధులు పొందేందుకే అని.. అధికారంలో ఉన్న పార్టీ మారితే విరాళాలు ఇచ్చేవారికి సమస్యలు తలెత్తుతాయనే కారణంతోనే దాతల పేర్లు రహస్యంగా ఉంచడం జరిగిందని అన్నారు. విరాళాల విషయంలో పారదర్శకత ఉండాలన్న సదుద్దేశంతోనే ఈ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు! దీనిలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తిస్తే.. సరిదిద్దమని పార్టీలను కోరాల్సిందని అభిప్రాయపడ్డారు.

కాగా... ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దీనికి సంబంధించిన బాండ్ల వివరాలన్నీ సమర్పించాలని స్టేట్ బ్యాంక్ కు సూచించింది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ కూడా వెలువడటంతో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి!!