Begin typing your search above and press return to search.

నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు...ఎవరిని ఉద్దేశించి....!?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాన్యుడు కాదు, కరడు కట్టిన ఆరెస్సెస్ కార్యకర్త నుంచి అఖిల భారత స్థాయిలో బీజేపీకి నాయకత్వం వహించిన వారు

By:  Tupaki Desk   |   8 Feb 2024 1:30 AM GMT
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు...ఎవరిని ఉద్దేశించి....!?
X

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాన్యుడు కాదు, కరడు కట్టిన ఆరెస్సెస్ కార్యకర్త నుంచి అఖిల భారత స్థాయిలో బీజేపీకి నాయకత్వం వహించిన వారు. నిబద్ధత నిజాయితీకి తన జీవితం మొత్తం పెద్ద పీట వేసిన వారిలో ఆయన ఒకరు. కేంద్రంలో మంత్రిగా ఆయన గత పదేళ్ళుగా పనిచేస్తున్నారు. బీజేపీలో రెండవ తరం నాయకులలో శ్రేష్టుడు. ఏ కోటరీకి చెందిన వారు కాదు.

అంతే కాదు బీజేపీలో తనకంటూ సొంత స్వరం ఎప్పటికపుడు వినిపించే అరుదైన నాయకుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాజ్ పేయ్ అద్వానీ శిష్యులలో మోడీ హయాంలో మిగిలిన బహు కొద్ది మందిలో ఒకరు. ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నా ఎప్పటికపుడు నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటారు. ఒక్కోసారి ఆయన ఆయన చేసే కామెంట్స్ అధికార బీజేపీకి ఇబ్బందిగా ఉంటే విపక్షలకు మహా ఇష్టంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా ముంబైలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా సంచలంగానూ ఉన్నాయి. ఆయన ఏమన్నారు అంటే రాజకీయాల్లో సిద్ధాంత నిబద్ధత తగ్గిపోతోంది అని. అంతే కాదు విలువలు పూర్తిగా పక్క తోవ పడుతున్నాయని.

మంచిగా ఉండేవారు, అవినీతి చేయని వారికి గౌరవం దక్కడం లేదని కూడా నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపూ అధికారంలో ఉన్న పార్టీతో కలసి వెళ్లాలనుకునే తాపత్రయం నేతలలో కనిపిస్తోంది తప్ప సిద్ధాంతాలను పట్టించుకునే వారు లేరు అని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కానే కాదు అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

వర్తమాన కాలంలో మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కడం లేదని, అలాగే అవినీతిపరులకు శిక్షలు పడడం లేదని ఆయన నొక్కి చెప్పడం విశేషం. సిద్ధాంతాలను నమ్మి రాజకీయ మనుగడ సాధించేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, అలాగే భావజాలంలో క్షీణత కూడా కనిపిస్తోందని ఆయన అంటున్నారు.

నాయకులు అంతా అధికారంలో ఉన్న వైపే వెళ్తే ప్రజాస్వామ్యానికి ఇబ్బందే అని అని ఆయన అంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ కి ఒక గుర్తింపు గౌరవం ఉన్నాయని వాటిని నిలబెట్టుకోవాలంటే ఈ పెడ ధోరణులు అన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని గడ్కరీ అభిప్రాయపడ్డారు

ఇక పాపులారిటీ ప్రచారం మీద కూడా ఆయన చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్న చర్చ కూడా ఉంది. పాపులారిటీ ప్రచారం అవసరమే కానీ అది శృతి మించుతోంది అని నితిన్ గడ్కరీ అంటున్నారు. నాయకులు వస్తూంటారు పోతూంటారు అని అంటూ పాలన వ్యవస్థ దేశం ఎపుడూ ఉంటాయని అన్నారు. అవే ఆదర్శంగా ఉంటాయని కూడా ఆయన అంటున్నారు.

నాయకులు ఎవరైనా నియోజకవర్గాలలో తాము చేసిన మంచి పనులే వారికి మంచి పేరు తెస్తాయని నితిన్ గడ్కరీ అంటున్నారు. ఆ దిశగా నాయకులు ఆలోచనలు చేయాల్సి ఉంది అన్నది నితిన్ కచ్చితమైన అభిప్రాయంగా ఉంది. ఇక తనను విశేషంగా ప్రభావితం చేసిన నాయకులలో అటల్ బిహారీ వాజ్ పేయ్ ఒకరని అలాగే జార్జి ఫెర్నాడేజ్ కూడా మరొకరు అని ఆయన చెప్పేశారు.

వాజ్ పేయ్ సొంత పార్టీ మనిషి, ఫెర్నాడేజ్ బయట పార్టీ మనిషి ఈ ఇద్దరూ తనకు ఇష్టులని చెప్పిన నితిన్ గడ్కరీకి సొంత పార్టీలో ఈ రోజు వరకూ విశేషంగా ప్రభావితం చేసిన మరో నేత లేరా అన్న చర్చ కూడా వస్తోంది.

అదే సమయంలో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని మెచ్చుకున్నారు. అలగే ఇటీవల భారత రత్న అవార్డు పొందిన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ ని కొనియాడారు.

బీహార్ లో ఒక దివంగత నేతతో పాటు ప్రస్తుతం ఉన్న లాలూని నితిన్ మెచ్చుకోవడం అంటే అక్కడ ప్రస్తుత సీం నితీష్ కుమార్ పోకడల మీద ఆయనకు అభ్యంతరాలు ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. ఇటీవలే లాలూ కూటమి నుంచి నితీష్ తప్పుకుని బీజేపీతో చేతులు కలిపారు. ఆయన రాజకీయ నిబద్ధత మీద చేసిన కామెంట్స్ నితీష్ మీదనేనా అన్నది ఒక సందేహం అయితే రాజకీయాల్లో ప్రచారాలూ పాపులారిటీ ఎక్కువ అయ్యాయని చెప్పినది ఎవరి గురించి అన్నది మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఏది ఏమైనా ప్రధాని రేసులో బీజేపీ నుంచి పోటీలో ఉన్న నితిన్ గడ్కరీ ఎపుడు ఏమి మాట్లాడినా సంచలనమే అవుతుంది అనడంలో సందేహం లేదు.