Begin typing your search above and press return to search.

ఆ కేంద్ర మంత్రి మళ్లీ సెటైర్ వేసేశారు.. మటన్ పంచినా ఓడారట!

ఇక గడ్కరీ మంగళవారం కీలక వ్యాఖ్యాలు చేశారు. గతంలో ఓ ఎన్నికలో తాను కిలో మాంసం (మటన్) పంచినా ఓడిపోయినట్లు చెప్పారు

By:  Tupaki Desk   |   25 July 2023 11:34 AM GMT
ఆ కేంద్ర మంత్రి మళ్లీ సెటైర్ వేసేశారు.. మటన్ పంచినా ఓడారట!
X

కేంద్రంలో తొమ్మిదేళ్లకు పైగానే అధికారం సాగిస్తోంది బీజేపీ. రాష్ట్రాల్లో ప్రత్యర్థులను అణచివేస్తూ.. జాతీయ స్థాయిలో వారిని నోరెత్తకుండా చేస్తూ అప్రతిహతంగా పెత్తనం చేస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కాస్తోకూస్తో గొంతు పెగిలేది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకే. ప్రభుత్వంలో నంబర్ 2 ఆయన. రక్షణ మంత్రి రాజ్ నాథ్ కూడా సీనియర్ అయినప్పటికీ ఆయనకేమీ మాట్లాడేందుకు లేదు.

నోరిప్పలేని మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్గంలో చాలామంది ఉన్నారు. అసలు నోరేలేని వారు ఇంకెందరో..? కానీ ఒక్కరు మాత్రం దీనికి భిన్నం. ఆయనకు కాస్త స్వేచ్ఛ ఎక్కువేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. మోదీని కూడా ధిక్కరించేలా ఉంటాయి ఆ కేంద్ర మంత్రి ప్రకటనలు.

శాఖాపరంగానే కాక రాజకీయంగానూ ఆ మంత్రి మాటలు ప్రాధాన్యంగా నిలుస్తుంటాయి. సొంత ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్నట్లు వ్యతిరేకిస్తున్నట్లుగానూ ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. ఈ క్రమంలో కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు స్థానం ఉంటుందా? అనే సందేహాలు వస్తుంటాయి.

కానీ, స్థానబలం, సైద్ధాంతిక బలం ఆయనను కాపాడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ వివరమంతా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురించి. గత నెలలో ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగాయి. దానిమీద కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఖాళీ లేవని.. ప్రమాణ స్వీకారానికి కుట్టించుకున్న దుస్తులతో ఆశావహులు వేచి చూస్తున్నారని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేసిన గడ్కరీ ఏడాదిన్నర కిందట అయితే మోదీ నాయకత్వాన్నే ప్రశ్నించేలా వ్యవహరించారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో శాఖలు తీసుకునే నిర్ణయాలను స్వేచ్ఛగా చెప్పగలిగేది గడ్కరీ ఒక్కరే. మిగతా ఏ మంత్రులకూ అంత స్వాతంత్ర్యం లేదు. మరో విశేషం ఏమంటే.. గడ్కరీ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా కీలక మార్పులు తీసుకొచ్చారు. పలు రహదారులను జాతీయ హోదాకు పెంచారు. ప్రగతిదాయక కార్యక్రమాలు ఇంకా అనేకం చేపట్టారు.

ఆర్ఎస్ఎస్ అడ్డాలో..

గడ్కరీ నాగపూర్ కు చెందినవారు. ఈ నగరంలోనే బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. గడ్కరీకి ప్రజా బలం కూడా అధికం. అసలాయన ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు. అందుకనే ఆ మాత్రం స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. ఇక గడ్కరీ మంగళవారం కీలక వ్యాఖ్యాలు చేశారు.

గతంలో ఓ ఎన్నికలో తాను కిలో మాంసం (మటన్) పంచినా ఓడిపోయినట్లు చెప్పారు. నాగపూర్‌ లో మహారాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యాయ మండలి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ‘ఓటర్లు చాలా తెలివైనవారు.. ఎవరికి ఓటేయాలో వారికి తెలుసు. రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తే.. ఇలా డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం, బ్యానర్లు, పోస్టర్లపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు’’ అని తనదైన శైలిలో ముక్తాయిపు ఇచ్చారు.