అమెరికా బాబులా చేస్తాను అంటున్న గడ్కరీ !
అయితే గడ్కరీ తన అసంతృప్తిని వేరే విధంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అది కూడా చాలా అందంగా చెబుతారు. వ్యంగ్యంగా చెబుతారు. పరోక్షంగా చెబుతారు.
By: Tupaki Desk | 11 April 2025 11:36 PM ISTనితిన్ గడ్కరీ. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకుడు. నిబద్ధతకు నిజాయతీకి మారు పేరు. బీజేపీ ప్రభుత్వంలో సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని అవతగిన అర్హతలు అన్నీ ఉన్న వారు. ఇలా ఆయన గురించి ఎంతో చెప్పుకోవచ్చు
నితిన్ గడ్కరీకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతోంది. కానీ హోం రక్షణ, ఆర్ధిక వంటి టాప్ త్రీ పోర్ట్ ఫోలియోలు మాత్రం లభించడంలేదు అన్నది ఉంది. ఇక ఆయన సీనియారిటీకి సిన్సియారిటీకి తగిన స్థానం దక్కడం లేదన్న అసంతృప్తి ఆయన అనుచరులలో ఉంది.
అయితే గడ్కరీ తన అసంతృప్తిని వేరే విధంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అది కూడా చాలా అందంగా చెబుతారు. వ్యంగ్యంగా చెబుతారు. పరోక్షంగా చెబుతారు. అవి ఎవరికి తగలాలో వారికి తగిలేలా కవితాత్మకంగానూ చెబుతారు. అయినా ఆయన గీత దాటరు, తన పనిని ఎక్కడా తగ్గించరు ఇచ్చిన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేస్తారు.
ఆయన రోడ్లు ఉపరితల రవాణా శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ శాఖలో ఎన్నో సంస్కరణలను తెచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కూడా టెక్నాలజీని వాడుతున్నారు. బైక్స్ కొన్నపుడే హెల్మెట్ ఇచ్చేలా ఇటీవల ఉత్పత్తిదారులకు సూచనలు చేశారు.
అదే సమయంలో తన శాఖలో జరిగిన తప్పులకు ఆయన ఓపెన్ గానే పార్లమెంట్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూంటారు. తాను రహదారుల శాఖ మంత్రిగా ఉన్నాను కానీ దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టలేకపోతున్నాం అని ఆయనే చెప్పుకున్నారు. అంతర్జాతీయ వేదికల మీద ఈ విషయం ప్రస్తావనకు వస్తూంటే తనకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని కూడా ఆయన బాధతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా ఆయన తన శాఖ గురించి మరో విషయం చెప్పారు. దేశంలో రోడ్లను అమెరికాను తలదన్నేలా నిర్మిస్తామని ప్రకటించారు. తన హయాంలో గత పదకొండేళ్లుగా జాతీయ రహదారులను ఎన్నింటినో అభివృద్ధి చేశామని చెప్పిన ఆయన వాటిని ఇంకా అందంగా అద్దంలా చేస్తామని చెప్పారు.
ఈ రోడ్లు అమెరికా రోడ్ల కంటే అద్భుతంగా ఉంటాయని ఊరిస్తున్నారు. ఈ విధంగా ఆయన శాఖాపరంగా ఒక సవాల్ ని తానే సృష్టించుకుని మరీ దానిని సాధిస్తాను అని చెబుతున్నారు. అమెరికా అభివృద్ధి చెందింది అంటే ధనవంతమైన దేశంగా ఉండడం వల్ల కాదని రోడ్ల వల్ల అని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ కూడా రోడ్లతోనే అభివృద్ధి ఏమిటో చూపిస్తుందని అన్నారు
ఇలా నితిష్ గడ్కరీ దేశ ప్రజలకు ఒక శుభ సందేశమే వినిపించారు. మరో వైపు చూస్తే ఆయన అభివృద్ధి గురించే చర్చ సాగాలని అంతా ప్రగతి కోసమే పాటు పడాలని చెబుతూ ఉంటారు. ఒకనాడు బీజేపీలో వాజ్ పేయ్ మాదిరిగా ఈ రోజు నితిన్ గడ్కరీ ఉన్నారని అంటారు అంతా. ఆయనకు విపక్షంలోనూ మద్దతుదారులు హెచ్చుగా ఉంటారు. ఆయన అందరి వాడుగా పేరు తెచ్చుకున్నారు. ఆర్ ఎస్ ఎస్ కి దగ్గరివారు అయిన గడ్కరీకి ప్రధాని యోగం ఉందా అంటే ఏమో ఎవరు చెప్పొచ్చారు, గుర్రం ఎగురుతుందేమో అన్న వారూ ఉన్నారు.
