రాజకీయాల్లో నిజాల పై నిషేధం.. గడ్కారీ ఏం చెప్పారు సార్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కారీ దేశ రాజకీయాలపై విసిగిపోయారా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 2 Sept 2025 7:08 PM ISTకేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కారీ దేశ రాజకీయాలపై విసిగిపోయారా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ప్రజలను మోసం చేయగలిగిన వాడే నేతల్లోకెల్లా గొప్ప నేతగా గుర్తింపు తెచ్చుకుంటారని గడ్కారీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి ఏ ఉద్దేశంతో..? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు ఆరా తీస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితుడిగా గడ్కారీని చెబుతారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం నాగపూర్ నుంచి వరుసగా ఎంపీగా గెలుస్తూ వచ్చిన గడ్కారీ ఒకనొక దశలో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరిగింది. వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గడ్కారీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇక ప్రధాని మోదీ క్యాబినెట్ లో మూడో సారి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న గడ్కారీ గత పదకొండేళ్లుగా ఒకేశాఖను నిర్వహిస్తున్నారు. బీజేపీలో అత్యంత ప్రతిభావంత నేతల్లో ఒకరుగా భావించే గడ్కారీ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అఖిల భారత మహానుభావ పరిషత్ నిర్వహించిన సమావేశంలో గడ్కారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బతకడానికి దగ్గరిదారులు (షార్ట్ కట్స్) వెతకొద్దని, నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయుతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దగ్గరిదారులు సత్వర ఫలితాలు ఇవ్వొచ్చునేమో గానీ, దీర్ఘకాలంలో విశ్వసనీయుతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. విజయం ఎప్పుడూ సత్యం వెంటే ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడైనా చివరికి సత్యమే గెలుస్తుందని చెప్పాడని పేర్కొన్నారు.
ఈ సమయంలో తన కోసం ఆయన మాట్లాడుతూ, దైనందన జీవితంలో అంటే రాజకీయాల్లో నిజం మాట్లాడటం నిషేధమని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపింది. ‘నేను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషేధం, ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో అంతుచిక్కడం లేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇటీవల కాలంలో గడ్కరీ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారని అంటున్నారు. కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, పరిపాలన అద్భుతంగా సాగుతుందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించే వారి కారణంగా రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడటం, మంత్రులు చేయలేని పనులు న్యాయస్థానాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించడం వెనుక బలమైన కారణమేదైనా ఉందా? అని ఆరా తీస్తున్నారు. అధికారంలో ఉంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపైన, పాలనపైనా ఆయన వ్యతిరేకత పెంచుకుంటున్నారా? అనే చర్చకు కారణమవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులు చేసే నేతలకు గౌరవం దక్కదని, చెడు పనులు చేసే వారికి శిక్షలు ఉండవని గతంలో గడ్కారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు.
