Begin typing your search above and press return to search.

రోడ్ల మంత్రి గడ్కరీ ఇలాకాలో.. జాతీయ రహదారి ఇలాగా?

ఆయన పేరు నితిన్ గడ్కరీ.. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో స్వేచ్ఛగా మాట్లాడే ఏకైక నాయకుడు.

By:  Tupaki Desk   |   30 May 2025 11:59 PM IST
రోడ్ల మంత్రి గడ్కరీ ఇలాకాలో.. జాతీయ రహదారి ఇలాగా?
X

ఆయన పేరు నితిన్ గడ్కరీ.. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో స్వేచ్ఛగా మాట్లాడే ఏకైక నాయకుడు. అది రాజకీయాలైనా.. డెవలప్ మెంట్ పనులైనా.. ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం గడ్కరీ నైజం. అలాగని గడ్కరీ కేవలం మాటల మనిషి మాత్రమే కాదు. ఆయన చేతల మనిషి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత దేశ చరిత్రలో ఏ ఉపరితల రవాణా శాఖ మంత్రి కూడా నిర్మించలేనన్ని రహదారులు గడ్కరీ హయాంలో నిర్మాణం అయ్యాయి. అవుతున్నాయి. వీటి విలువ మొత్తంగా చెప్పాలంటే రూ.20 లక్షల కోట్లపైనే ఉండొచ్చు.

అంతెందుకు..? గడ్కరీ హయాంలో తెలుగు రాష్ట్రాలకే భారీఎత్తున రోడ్డు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఖమ్మం-దేవరపల్లి మధ్య దాదాపు పూర్తికావొచ్చిన గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక్కటి చూస్తే చాలు.. గడ్కరీ పనితీరు ఏమిటో మనకు తెలిసిపోతుంది.

దాదాపు రూ.2 లక్షతో కోట్ల కేంద్రం నిధులతో యూపీ, మహారాష్ట్రలో రోడ్ల నిర్మాణం జరిగింది. గడ్కరీ అంటే ఇదీ అనేలా జాతీయ రహదారులను చూస్తే చెప్పే పరిస్థితి. కానీ, మహారాష్ట్రలో ఓ జాతీయ రహదారి పరిస్థితిని గమనిస్తే.. గడ్కరీ సొంత రాష్ట్రంలో ఇలా ఉంటుందా? అనిపిస్తుంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అడవులు అధికంగా ఉండే గడ్చిరోలి జిల్లాలో వర్షాల ప్రభావం అధికంగానే ఉంటుంది. ఈ జిల్లాలోని ఆల్లపల్లి-సిరోంచా మార్గంలోని జాతీయ రహదారి వర్షాలకు తీవ్రంగా ప్రభావితం అయింది.

ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడం గమనార్హం. కానీ, తొలకరి జల్లులతో బురదమయంగా మారింది. అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో దాదాపు రెండు కిలోమీటర్లు అటవీ అనుమతులు లేకపోవడంతో.. జాతీయ రహదారి నిర్మాణం నిదానంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగేళ్లు అయినా పూర్తికాలేదు. గురువారం ఈ మార్గంలో ఓ బస్సు ఆగిపోయింది. చివరకు చేసేది ఏం లేక ప్రయాణికులు కిందకు దిగి.. గ్రామస్థుల సాయంతో బస్సును నెట్టారు. కొంత దూరం వారు బుదరలో నడుచుకుంటూ వెళ్లారు.