సినిమా చూపిస్తా అంటున్న గడ్కరీ
నితిన్ గడ్కరీ బీజేపీలో అగ్రశ్రేణి నాయకుడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని నిర్వహించిన వారు.
By: Tupaki Desk | 22 Jun 2025 11:00 AM ISTనితిన్ గడ్కరీ బీజేపీలో అగ్రశ్రేణి నాయకుడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని నిర్వహించిన వారు. సంఘీయుడు. ఆరెస్సెస్ చల్లని చూపు తన మీద ఉన్న వారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. ఎంతో కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు.
బీజేపీలో ఈ రోజు దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం కన్నా ఆయన సీనియర్ గా జాతీయ రాజకీయాలలో ఉన్నారు. గట్టిగా ఒక మాట చెప్పుకోవాలీ అంటే ప్రధాని మంత్రి రేసులో ఆయన ఉన్నారు. ఉదారవాద రాజకీయాలు చేస్తారు అని పేరుంది. వాజ్ పేయి కి మరో రూపుగా ఆయనను చెప్పుకుంటారు.
బీజేపీతో పాటు ప్రతిపక్షంలోనూ ఆయనకు మంచి మిత్రులు ఉన్నారు అందరితోనూ మంచి రిలేషన్స్ కొనసాగించే నేతగా ఆమోదయోగ్యుడిగా గడ్కరీ ఉన్నారు. అలాంటి గడ్కరీ తాను సినిమా చూపిస్తారు అని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న 11 ఏళ్ళ కాలంలో తన పాత్ర కేవలం న్యూస్ రీల్ మాత్రమే అని ఆయన చెప్పడం విశేషం. ఇంకా చాలా ఉంది అని ఊరిస్తున్నారు. తాను ఏమి చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది అని ఆయన అంటూ ఏ బాధ్యత అప్పగించినా చేస్తాను అని చెప్పారు.
తన అసలైన సినిమా కూడా తరువాత ప్రారంభం అవుతుందని ఆయన అనడం సంచలన వ్యాఖ్యలుగా చూస్తున్నారు. తాను ఇటీవల రోడ్ల అభివృద్ధి పనుల కంటే వ్యవసాయ పనుల విషయంలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నాను అని ఆయన అన్నారు. విదర్భలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు కృషి చేయాలన్నది తన కోరిక అన్నారు.
ఇక 11 ఏళ్ళ మోడీ పాలన మీద ఆయన మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా దేశంలో ఇంకా తలసరి ఆదాయం పెద్దగా పెరగలేదు అన్నారు. తలసరి ఆదాయం అధికంగా ఉన్న తొలి పది దేశాల జాబితాలో భారత్ లేకపోవడానికి కారణం అధిక జనాభాగా చెప్పారు. అంతే కాదు జనాభా సమస్యని భాషాపరంగానో లేక మత పరంగానో చూడకుండా ఆర్థిక సమస్యగా చూడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో చాలా అభివృద్ధి సాగుతోందని అయితే ఫలితాలు మాత్రం అందరికీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీనియర్ నేతగా కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ సినిమా చూపిస్తాను అన్నట్లుగా చేసిన వ్యాఖ్యల మీద చర్చ సాగుతోంది. ఆరున్నర పదుల వయసులో ఉన్న ఆయనకు ప్రధాని పదవి చేపట్టడానికి చాన్స్ ఉందని అంటున్నారు. ఏడున్నర పదుల వయసులో మోడీ ఉన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి మోడీకి ఎనభై ఏళ్ళు వస్తాయి. మరి ఆయనకు నాలుగో సారి ప్రధానిగా చాన్స్ ఉంటుందా లేదా అన్నది బీజేపీ ఆరెస్సెస్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే అంటూ నితిన్ చేసిన వ్యాఖ్యలలో అర్ధాలను ఇక్కడే వెతుక్కోవాలని అంటున్నారు. అంటే నితిన్ ని కాబోయే ప్రధానిగా చూడొచ్చా అంటే ఏమో రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటున్నారు. సో నితిన్ ని చాన్స్ ఉందన్న మాట. అందుకే ఆయన సినిమా చూపిస్తాను అంటున్నారని చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
