గడ్కరీ చెప్పిన అసలు ఏమిటీ ‘ఇథనాల్ స్టవ్’? దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి?
దేశంలో వంట గ్యాస్ (ఎల్.పీజీ) ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు.
By: A.N.Kumar | 26 May 2026 2:38 PM ISTదేశంలో వంట గ్యాస్ (ఎల్.పీజీ) ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. “ఎల్‌పీజీ కంటే చాలా తక్కువ ఖర్చుతోనే వంట చేసుకోవచ్చు” అంటూ ఆయన పరిచయం చేసిన ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్ టెక్నాలజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్యాస్ సిలిండర్ల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని సామాన్యులు ఆశపడుతుంటే పరిశ్రమలు, పర్యావరణ నిపుణులు దీని భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు మొదలుపెట్టారు.
అసలు ఏమిటీ ‘ఇథనాల్ స్టవ్’? దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి?
సాధారణంగా మనం ఇళ్లలో వాడే ఎల్‌పీజీ గ్యాస్ స్థానంలో ఇథనాల్ అనే బయోఫ్యూయల్‌ను ఇంధనంగా ఉపయోగించే స్టవ్ ఇది. చెరకు రసం, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తారు. నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సరికొత్త స్టవ్‌లో ఇథనాల్‌ను నిర్దేశిత పరిమాణంలో నీటితో కలిపి ఉపయోగిస్తారు. ఈ మిశ్రమం ద్వారా ఎలాంటి పొగ, మసి లేకుండా ఎల్‌పీజీ తరహాలోనే స్వచ్ఛమైన నీలి రంగు మంట వస్తుంది.
ప్రస్తుతం భారత్ తన చమురు, గ్యాస్ అవసరాల కోసం దాదాపు 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా సిలిండర్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ డిపెండెన్సీని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ అసలు ప్లాన్. ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను విజయవంతంగా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే ఫార్ములాను వంట గ్యాస్ రంగానికి కూడా వర్తింపజేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.
ఈ ఇథనాల్ స్టవ్ వల్ల ఎవరికి లాభం?
ఈ సరికొత్త ఇంధన విప్లవం వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ రీఫిల్లింగ్ భారం భారీగా తగ్గుతుంది. ఎల్‌పీజీతో పోలిస్తే ఇథనాల్ ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న హోటళ్లు, క్యాంటీన్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. రైతులకు బంపర్ ఆఫర్ గా ఉంటుంది. ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాలు ముడిసరుకు కావడంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. ఇది నూటికి నూరు శాతం గ్రీన్ ఫ్యూయల్ కావడం వల్ల బొగ్గు పులుసు వాయువుల ఉద్గారాలు తగ్గి, కాలుష్యం అదుపులోకి వస్తుంది. చమురు దిగుమతులు తగ్గడం వల్ల దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
కానీ.. అంత ఈజీ కాదు! ఇవీ ప్రధాన సవాళ్లు
ఈ సరికొత్త టెక్నాలజీ వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇది క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రారంభంలో ప్రభుత్వం దీనిపై సబ్సిడీలు ఇచ్చి స్టవ్, ఫ్యూయల్ ధరలను తక్కువగా ఉంచవచ్చు. కానీ భవిష్యత్తులో డిమాండ్ విపరీతంగా పెరిగినప్పుడు ఇథనాల్ ధరలు ఎల్‌పీజీ స్థాయికి చేరవనే గ్యారెంటీ ఏంటి? ఇళ్లలో ఇథనాల్‌ను ద్రవ రూపంలో నిల్వ ఉంచడం, లీకేజీలను అరికట్టడం, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాల్సి ఉంటుంది.
యువత కోసం ₹40 కోట్ల భారీ ప్రోత్సాహం!
ఈ ఇథనాల్ కుకింగ్ టెక్నాలజీని కేవలం ఒక ప్రయోగంగా వదిలేయకుండా భవిష్యత్ ఇంధన మార్పులో భాగంగా మార్చాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈ టెక్నాలజీని మరింత సురక్షితంగా చౌకగా మార్చేందుకు వీలుగా యువ ఇన్నోవేటర్లు, స్టార్టప్‌ల కోసం ₹40 కోట్ల భారీ ప్రోత్సాహక నిధిని నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇది యువతలో సరికొత్త ఆవిష్కరణలకు పదును పెట్టనుంది.
ఒకప్పుడు మన దేశంలో కట్టెల పొయ్యిల స్థానంలో ఎల్‌పీజీ గ్యాస్ వచ్చినప్పుడు కూడా ప్రజలు మొదట్లో భయపడ్డారు, ఎన్నో సందేహాలు వ్యక్తంచేశారు. కానీ కాలక్రమేణా అది నిత్యావసరంగా మారింది. ఇప్పుడు ఇథనాల్ స్టవ్‌ల పరిస్థితి కూడా అంతే!
తక్కువ ధర, నిరంతర సరఫరా, పక్కా భద్రత.. ఈ మూడు అంశాలలో గనుక ప్రభుత్వం విజయం సాధిస్తే, రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో “గ్యాస్ సిలిండర్ బుక్ చేశావా?” అనే మాట కంటే.. “ఇథనాల్ క్యాన్ నింపించావా?” అనే మాట వినిపించడం ఖాయం!
