Begin typing your search above and press return to search.

నా మెద‌డు విలువ నెల‌కు రూ.200 కోట్లు... గ‌డ్క‌రీ అంత మాట‌న్నారేమిటి?

ప్ర‌ధాని మోదీ కేబినెట్ లో స్వేచ్ఛ‌గా అభిప్రాయాలు వ్య‌క్తం చేసే... నిర్మొహ‌మాటంగా విష‌యం చెప్పే మంత్రి ఎవ‌రంటే ముందుగా చెప్పుకోవాల్సింది నితిన్ గ‌డ్క‌రీ.

By:  Tupaki Desk   |   14 Sept 2025 11:00 AM IST
నా మెద‌డు విలువ నెల‌కు రూ.200 కోట్లు... గ‌డ్క‌రీ అంత మాట‌న్నారేమిటి?
X

ప్ర‌ధాని మోదీ కేబినెట్ లో స్వేచ్ఛ‌గా అభిప్రాయాలు వ్య‌క్తం చేసే... నిర్మొహ‌మాటంగా విష‌యం చెప్పే మంత్రి ఎవ‌రంటే ముందుగా చెప్పుకోవాల్సింది నితిన్ గ‌డ్క‌రీ. బీజేపీ జాతీయ మాజీ అధ్య‌క్షుడు కూడా అయిన గ‌డ్క‌రీ.. ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా దేశంలో అనేక జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి పూనుకున్నారు. ఇంకా అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అందుకే ఆయ‌న‌ను రోడ్క‌రీ అని కూడా పిలుస్తుంటారు. మ‌హారాష్ట్రకు చెందిన గ‌డ్క‌రీకి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం బ‌లం. అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న నాగ‌పూర్ కు చెందిన‌వారు. అందుకేనేమో మోదీ కేబినెట్ లో స్వేచ్ఛ‌గా వ్య‌వ‌హ‌రించ‌గ‌లుగుతారు.

ఇప్పుడు దేశంలో ప్ర‌ధానం చ‌ర్చ‌నీయం అవుతున్న విష‌యం 20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్. అయితే, భావి అవ‌స‌రాలు, నేచ‌ర్ ప‌రిర‌క్ష‌ణ‌ రీత్యా ఈ ఇంధ‌నం మంచిద‌నేది అంచ‌నా. కానీ, సుర‌క్షితం కాదంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు.. నేరుగా గ‌డ్క‌రీకే వ్య‌క్తిగ‌త ల‌బ్ధి చేకూరింద‌ని, మంత్రిగా అందుకే ఆయ‌న ప్ర‌మోట్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెందారు. రాజ‌కీయంగా త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని ఆవేద‌న చెందారు. ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ను పెయిడ్ క్యాంపెయిన్ గా గ‌డ్క‌రీ అభివ‌ర్ణించారు. వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ఆయ‌న పెట్రోల్ లాబీ కుట్ర‌గానూ పేర్కొన్నారు.

నాకు డ‌బ్బుకు లోటు లేదు...

20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోలో సేఫ్ కాదంటూ ఇటీవ‌ల జ‌రుగుతున్న చ‌ర్చ‌-అందులో త‌న‌కు ఆర్థిక‌ ప్ర‌యోజ‌నం ఉంద‌నే ఆరోప‌ణ‌ల‌కు తెర‌దించుతూ.. త‌న‌కు డ‌బ్బుకు లోటు లేద‌ని గ‌డ్క‌రీ తాజాగా వ్యాఖ్యానించారు. త‌న మెద‌డు విలువ నెల‌కు రూ.200 కోట్లు అని పేర్కొన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం నాగ‌పూర్ లో అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో గ‌డ్క‌రీ మాట్లాడుతూ... త‌న ఆలోచ‌న‌లు రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేవి అని అన్నారు. వాటి ద్వారా తాను జేబులు నింపుకొనేందుకు కాద‌ని స్ప‌ష్టం చేశారు.

డ‌బ్బు కోసం చేస్తున్నానా..?

నేను డ‌బ్బు కోసం ఈ ప‌ని (20 శాతం ఇథ‌నాల్ క‌లిపి పెట్రోల్) చేస్తున్న‌ట్లు అనుకుంటున్నారా? అంటూ గ‌డ్క‌రీ ప్ర‌శ్నించారు. నిజాయ‌తీగా ఎలా సంపాదించాలి? అనేది త‌న‌కు తెలుస‌ని, త‌న‌కూ ఓ కుటుంబం, ఇల్లు ఉన్నాయ‌ని, తానేమీ సాధువును కాద‌ని చెప్పుకొచ్చారు. రాజ‌కీయ నాయ‌కుడిగా రైతుల శ్రేయ‌స్సు కోసం త‌న ప్ర‌య‌త్నాలు సాగుతాయ‌ని చెప్పుకొచ్చారు.

ఈ20తో ఎంత ప్ర‌యోజ‌నం..??

20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వాడ‌కం.. పాత వాహ‌నాల సామ‌ర్థ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌నే ఆరోప‌ణ‌లు, డ్రైవింగ్ పై ప్ర‌భావం ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు వ‌చ్చాయి. వీటిని కేంద్ర ప్ర‌భుత్వం ఖండించింది కూడా. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు మ‌నం ముడిచ‌మురును అత్య‌ధికంగా దిగుమ‌తి చేసుకుంటున్నాం. వాహ‌న కాలుష్యం పెరుగుతోంది. దీన్నుంచి త‌ప్పించేందుకు... భ‌విష్య‌త్ లో ఇంధ‌న భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం 20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వాడ‌కం ఆలోచ‌న చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.