0.07 శాతమే అంట.. ఇథనాల్ వివాదంపై మంత్రి గడ్కరీ క్లారిటీ!
దేశంలో ఏటా 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో తమ కుటుంబ సంస్థ వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని గడ్కరీ తేల్చిచెప్పారు.
By: Tupaki Political Desk | 9 July 2026 9:07 PM ISTదేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఇథనాల్ బ్లెండింగ్' (పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం) కార్యక్రమం గత కొంతకాలంగా రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని, ఆయన కుటుంబానికి ఇథనాల్ పరిశ్రమలో వాటాలు ఉన్నాయని, ఆ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గడ్కరీ తాజాగా తనపై చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. దేశంలో ఏటా 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో తమ కుటుంబ సంస్థ వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని గడ్కరీ తేల్చిచెప్పారు.
గడ్కరీయే టార్గెట్?
కేంద్ర మంత్రిగా గడ్కరీ ఇథనాల్ తయారీని, దాని వాడకాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని, దీని వెనుక ఆయన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా గడ్కరీ కుమారులకు ఇథనాల్ తయారీ యూనిట్లతో సంబంధం ఉందని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వారి వ్యాపారానికి లబ్ధి చేకూరుస్తాయని విపక్షాల వాదన. ఈ ఆరోపణలను మంత్రి గతంలోనూ అనేకసార్లు కొట్టిపారేశారు. తాజాగా ఇథనాల్ బ్లెండింగును 30 శాతం పెంచేలా కేంద్రం సానుకూల వైఖరి తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. దీంతో గడ్కరిపై మరోసారి విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఆయన తాజాగా మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.
లాభం సున్నా.. గడ్కరీ వివరణ
తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. విపక్షాల ఆరోపణలను మరోసారి ఖండించారు. ఇథనాల్ పాలసీ వల్ల తనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏటా దాదాపు 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోందని, ఇందులో తమ కుటుంబ సంస్థ వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంత తక్కువ వాటా ఉన్న వ్యక్తికి వేల కోట్ల రూపాయల పరిశ్రమ వల్ల వచ్చే లాభం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ తక్కువ శాతం వాటా అనేది కేవలం ఒక సాధారణ రైతు స్థాయిలో ఉండే భాగస్వామ్యమని, దీనిని వ్యాపార సామ్రాజ్యంగా చిత్రీకరించడం దురుద్దేశపూర్వకమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ వివాదం వెనుక అసలు ఉద్దేశ్యమేంటి?
దేశం విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఇథనాల్ ఒక కీలక మార్గమని గడ్కరీ గతంలోనే చెప్పారు. వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన వాదిస్తుంటారు. అయితే, రాజకీయ ప్రత్యర్థులు దీనిని ఒక "కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్" (ప్రయోజనాల సంఘర్షణ)గా చూపుతూ గడ్కరికి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని చెబుతున్నారు.
కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజా వివరణతో తనపై విమర్శలకు చెక్ చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. మరోవైపు ఇందులో రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, ఇథనాల్ బ్లెండింగ్ అనేది దేశంలో రైతులకు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇథనాల్ బ్లెండింగును 40 శాతానికి పెంచే అవకాశం ఉందని, దశల వారీగా ఇది వంద శాతం చేస్తారని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇథనాల్ ఉత్పత్తి పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
