Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ లో ట్విస్టు.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సర్ ప్రైజ్ చేసిన కేంద్ర మంత్రి!

ఇంతటి పలుకుబడి ఉన్న నితిన్ గడ్కారీ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   28 Aug 2025 9:00 PM IST
ఏపీ పాలిటిక్స్ లో ట్విస్టు.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సర్ ప్రైజ్ చేసిన కేంద్ర మంత్రి!
X

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ అధికార బీజేపీ నేతల తీరులో వస్తున్న మార్పు ఈ చర్చకు కారణమవుతోంది. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. కేంద్రంలో సొంత వ్యూహంతో అడుగులు వేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం వల్ల రాష్ట్రంలో టీడీపీకి ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. దీనికి ఉదాహరణగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ చేసిన ట్వీట్ ను చూపుతున్నారు.

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి మిత్రుడిగా చెబుతారు. ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం నాగ్ పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ గడ్కారీకి సంఘ్ పెద్దల వద్ద మంచి పరపతి ఉంది. ఈ కారణంగానే బీజేపీకి ఆయన భావి ప్రత్యామ్నాయం అన్న ప్రచారం గతంలో జరిగింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ వరుసగా మూడు సార్లు ప్రమాణంచేసి ఎందరినో కేంద్ర మంత్రులుగా చేశారు. చాలా మందికి కొత్తశాఖలు కేటాయించినా, నితిన్ గడ్కారీకి మాత్రం మూడు టర్ముల నుంచి ఒకేశాఖ కేటాయిస్తున్నారు. అంటే కేంద్రంలో, పార్టీలో నితిన్ గడ్కారీకి ఎంతటి ప్రాధాన్యం ఉందని అర్థమవుతోందని అంటున్నారు.

ఇంతటి పలుకుబడి ఉన్న నితిన్ గడ్కారీ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అవినాశ్ రెడ్డి సహచర పార్లమెంటు సభ్యుడిగా భావించి నితిన్ గడ్కారీ ట్వీట్ చేశారని ఎవరైనా అనుకుంటే పొరపాటని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ పెద్దల వ్యూహాత్మక నిర్ణయం వల్లే నితిన్ గడ్కారీ నుంచి ఆ ట్వీట్ వచ్చిందని అంటున్నారు. భవిష్యత్తులో వైసీపీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పెద్దలు ముందస్తు ప్రణాళికతో నితిన్ గడ్కారీతో ఆ ట్వీట్ చేయించి ఉంటారని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగాలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం చాలా ఎక్కువగా ఉంది. రాజ్యసభలో సంపూర్ణ బలం ఉన్నా, లోక్ సభలో చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుకు కోపం తెప్పించే పనిచేయకూడదనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. అదే సమయంలో తమకు నమ్మకమైన మిత్రుడు వైసీపీని వదులుకోవడం కూడా బీజేపీకి ఇష్టం లేదని అంటున్నారు. దీనికి ఇటీవల జరిగిన పరిణామాలు నిదర్శనంగా చెబుతున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఓట్లతోనే అధికారపక్షం నిలిపిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణణ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు వైసీపీ మద్దతు కోసం సంప్రదించడాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఐదేళ్లు.. అంతకు ముందు కూడా వైసీపీ ప్రతి సందర్భంలోనూ వైసీపీకి సహకరిస్తూ మద్దతుగా నిలుస్తూ వస్తోంది. అయితే తాజా పరిస్థితుల వల్ల వైసీపీ-బీజేపీ మధ్య మిత్రుత్వాన్ని బహిరంగ పరచలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం చంద్రబాబు మద్దతు కీలకం కావడమే అంటున్నారు. అయితే చంద్రబాబు మద్దతు ఎంత అవసరం అయినప్పటికీ వైసీపీని నొప్పించకూడదన్న నిర్ణయంతో ఉన్న బీజేపీ పెద్దలు వైసీపీని దూరం చేసుకోకూడదన్న వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

ఇందుకోసమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ద్వారా వైసీపీని తమ కంట్రోల్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో ఎందరో మంత్రులుగా ఉండగా, నితిన్ గడ్కారీకి మాత్రమే ఈ వ్యవహారం అప్పగించడం వెనుక ఓ వ్యూహం ఉందని అంటున్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన గడ్కారీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా స్నేహితుడు. చంద్రబాబు ఏ ప్రాజెక్టు అడిగినా నితిన్ గడ్కారీ వెనువెంటనే మంజూరు చేస్తుంటారు. అంతేకాకుండా వాజపేయి హయాం నుంచి గడ్కారీతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా నితిన్ గడ్కారీ ద్వారా ఏ పని చేసిన చంద్రబాబుకు ఆగ్రహం, అనుమానం రాదన్న కారణంతోనే ఆయనను రంగంలోకి దింపారని అంటున్నారు.

అందుకే కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి కేంద్ర మంత్రి గడ్కారీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో పెద్ద విశేషం ఏమీ లేకపోయినా, గడ్కారీ చేసిన ట్వీట్ వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి గడ్కారీ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.