నిత్యానంద బతికే ఉన్నారా? కైలాస ప్రకటనతో ఊరట.. ఆస్తుల వారసులెవరు?
అయితే, ఆయన స్థాపించినట్లు చెబుతున్న 'కైలాస' దేశం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో ఆయన బతికే ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 2 April 2025 5:21 AMవివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోయారంటూ వచ్చిన వార్తలు ఆయన అనుచరులను తీవ్రంగా కలవరపెట్టాయి. అయితే, ఆయన స్థాపించినట్లు చెబుతున్న 'కైలాస' దేశం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో ఆయన బతికే ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యానంద సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని కైలాస ప్రతినిధులు స్పష్టం చేశారు. నిన్న ఆయన మేనల్లుడు సుందరేశ్వర్.. నిత్యానంద జీవ సమాధి చెందారని ప్రకటించడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ తాజా ప్రకటన వారికి కాస్త ఊరటనిచ్చింది.
కాగా, నిత్యానందకు సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తుల గురించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయనకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో 'కైలాస' ద్వీపంతో పాటు, భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా.
- రంజిత వారసురాలా?
ఈ నేపథ్యంలో, నిత్యానంద ఆస్తులన్నీ ఆయన శిష్యురాలు, ఒకప్పటి ప్రముఖ నటి రంజితకు చెందుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిత్యానంద సన్నిహిత శిష్యులు కొందరు ఈ విషయాన్ని చెబుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా నిత్యానంద ధ్యానపీఠం కార్యక్రమాల్లో రంజిత చురుకుగా పాల్గొంటూ ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఒకవేళ ఇది నిజమైతే, రంజిత ఒక్కసారిగా వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అవుతారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది.
- నిత్యానంద ఆస్తుల సామ్రాజ్యం
నిత్యానంద కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు. ఆయన స్థాపించిన 'నిత్యానంద ధ్యానపీఠం' ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలను కలిగి ఉంది. కైలాస ద్వీపం ఆయన ప్రధాన కార్యస్థానంగా విలసిల్లుతోంది. భారతదేశంలోని తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆయనకు విలువైన భూములు, భవనాలు ఉన్నట్లు సమాచారం. తిరువణ్ణామలైలో పెద్ద ఎత్తున ఆశ్రమం, వ్యవసాయ భూములు ఉండగా, బిడదిలోని ధ్యానపీఠం వందల కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంచనా.
- న్యాయపరమైన చిక్కులు తప్పవా?
నిత్యానందకు భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండా మరణించి ఉంటే, ఈ ఆస్తుల పంపకం న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అంతేకాకుండా నిత్యానందపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై కూడా విచారణ జరిగే అవకాశం లేకపోలేదు.
- అనుచరుల్లో ఆందోళన
నిత్యానంద జీవసమాధి వార్త ఆయన అనుచరులను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి వస్తున్న వార్తలు వారిలో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమ గురువు బతికే ఉన్నారనే వార్త కొంత ఊరటనిచ్చినా, ఆయన ఆస్తుల భవితవ్యం ఏమిటనే ప్రశ్న వారిని వెంటాడుతోంది.
మొత్తానికి, నిత్యానంద మరణంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన బతికే ఉన్నట్లు కైలాస ప్రకటించినప్పటికీ, ఈ విషయంపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఆయన మరణిస్తే, ఆయన వదిలి వెళ్లిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎవరు నిర్వహిస్తారు? రంజిత వారసురాలు అవుతారా? లేక మరెవరైనా బాధ్యతలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు ఈ వార్త కేవలం ఊహాగానాలకే పరిమితం కావచ్చు.